తమిళంలో దాదాపు ఏడేళ్ల క్రితం కార్తి నటించిన సినిమా ‘మద్రాస్’ అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాను రూపొందించారు. ‘కబాలి’ కంటే ఆయన తీసిన సినిమా ఇది. రంజిత్ కెరీర్ లో ఇదొక బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ పాత సినిమాను తెలుగులో కొత్త సినిమా మాదిరి రిలీజ్ చేయాలని చూశారు ఓ నిర్మాత. సంక్రాంతికి పెద్ద సినిమాలు రేసు నుంచి తప్పుకోవడంతో సడెన్ గా ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేసే ప్రయత్నాలు చేశారు.
అంతేకాదు.. ఈ సినిమాకి ‘నా పేరు శివ 2’ అనే టైటిల్ కూడా పెట్టారు. గతంలో వచ్చిన కార్తి హిట్ సినిమా ‘నా పేరు శివ’కి సీక్వెల్ మాదిరి ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నాలు చేశారు. దీంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ఈ సినిమాను ట్రోల్ చేశారు. సోషల్ మీడియా లేని రోజుల్లో అయితే ఇలాంటి ప్లాన్లు వర్కవుట్ అయ్యేవేమో కానీ ఇప్పుడంత ఛాన్స్ లేదు. ‘నా పేరు శివ 2’ పాత సినిమా అనే విషయం బయటపెట్టి తెలుగు ప్రేక్షకులంటే అంత చులకనా అంటూ చిత్రబృందాన్ని ఏకిపారేశారు.
నిజానికి ఈ సినిమాను తెలుగులో కార్తితో ప్రమోట్ చేయించాలని కూడా అనుకున్నారు. సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్టర్లతో హడావిడి చేయడం.. సోషల్ మీడియాలో ఎదురైనా తీవ్ర విమర్శలు చూశాక చిత్రబృందం వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఈ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించారు. ఆ తరువాత కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ విడుదలైనా.. తెలుగు ఆడియన్స్ పెద్దగా పట్టించుకునేలా లేరు.