విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘మనం’ చిత్రాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఇది ఓ క్లాసిక్. అక్కినేని నాగేశ్వర రావు గారి చివరి చిత్రం కావడం అందులోనూ అక్కినేని హీరోలందరూ కలిసి నటించడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా అక్కినేని ‘మనం’ తరహాలో సినీ ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన కుటుంబాలు కూడా అలాంటి సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. మొన్నటికి మొన్న నందమూరి బాలకృష్ణ కూడా మనం తరహాలో ఓ కథ రెడీ చేయమని దర్శక నిర్మాతలకి చెప్పారని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఇప్పడు యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడట.
ఇటీవల విడుదలైన ‘కల్కి’ చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్నారు రాజశేఖర్. త్వరలోనే తన భార్య జీవిత అలాగే తన ఇద్దరు కూతుర్లు అయిన శివానీ, శివాత్మికలు కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారట. కథ కూడా లాక్ చేసారని తెలుస్తుంది. సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. అయితే దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇంకా తెలీలేదు. గతంలో రాజశేఖర్, జీవిత హీరో హీరోయిన్లు గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. కానీ ఎందుకో ఆ తరువాత ఆమె సినిమాలకి దూరమయ్యారు. ఇంతకాలానికి మళ్ళీ తన భర్త తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని తెలుస్తుంది.