నేను అలా చేశానని అవమానంగా భావించారు.. సంజయ్ దత్ పై యష్ వ్యాఖ్యలు!
March 28, 2022 / 03:37 PM IST
|Follow Us
కన్నడ స్టార్ యష్ హీరోగా రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కేజీఎఫ్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో విడుదలైన ‘కేజీఎఫ్’ సినిమాకి కొనసాగింపుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. పార్ట్ 2లో చాలా వరకు కొత్త క్యారెక్టర్లను దించారు. ఈసారి విలన్ గా సంజయ్ దత్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన సంజయ్ దత్ లుక్స్ సినిమాపై హైప్ పెంచాయి.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో యష్.. సంజయ్ దత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేస్తుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా నిన్న బెంగుళూరులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికలపై యష్ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది. ముందుగా నటుడు పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించిన యష్.. ఆ తరువాత ‘కేజీఎఫ్2’ సినిమా గురించి మాట్లాడారు.
ఈ సినిమా కోసం చిత్రబృందం చాలా కష్టపడిందని.. వారంతా చెమట, రక్తాన్ని చిందించి మరీ ఈ సినిమాను పూర్తి చేశారని అన్నారు. కేజీఎఫ్ సినిమా క్రెడిట్ మొత్తం ప్రశాంత్ నీల్ కే చెందుతుందని చెప్పారు. అలానే ఈ సినిమాలో విలన్ రోల్ పోషించిన సంజయ్ దత్ గురించి గొప్పగా మాట్లాడారు యష్. ‘కేజీఎఫ్ 2’ సినిమా మొదలైన కొన్ని రోజులకే సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వెళ్లారని.. దాని నుంచి కోలుకొని వెంటనే అదే ఉత్సాహంతో సెట్ లో జాయిన్ అయి కమిట్మెంట్ తో వర్క్ చేశారని అన్నారు.
పని విషయంలో ఆయనకున్న నిబద్ధతే ఆయన్ని ఆ స్థాయిలో ఉంచిందని చెప్పారు. సంజయ్ దత్ తో యాక్షన్ సీక్వెన్స్ చేసేప్పుడు అందరిలో ఒక భయం ఉండేదని అన్నారు. ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండమని సెట్ లో అందరికీ చెబుతుంటే.. ఆయన అవమానంగా ఫీల్ అయ్యారని యష్ తెలిపారు. ఓ రోజు తనను పిలిచి ‘యష్ భాయ్ నువ్ నన్ను అలా అవమానించకు. నువ్ నా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నావని తెలుసు.. కానీ నేను నటించగలను. ది బెస్ట్ ఇస్తాను’ అని చెప్పారని.. అలానే ఇచ్చారని యష్ చెప్పుకొచ్చారు.