హిట్ కొట్టిన డైరెక్టర్ వెనుక మన స్టార్ హీరోలు క్యూ కట్టడం చూసి ఉంటాం, క్రేజ్ లో ఉన్న హీరోయిన్ కోసం క్యూ కట్టిన కథానాయకులను చూసుంటాం. కానీ.. విచిత్రంగా ఈమధ్య మన స్టార్లందరూ సర్జరీలకు క్యూ కట్టారు. మొన్నామధ్య బాలయ్య ‘జై సింహా’ రిలీజ్ అనంతరం షోల్డర్ సర్జరీ చేయించుకొన్న విషయం తెలిసిందే. ఇక నిన్న షోల్డర్ సర్జరీ చేయించుకొన్న మాధవన్ “ఐయామ్ సేఫ్” అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ కూడా చేశాడు. ఇవాళ నితిన్ కూడా సర్జరీ చేయించుకొంటున్నాడు. గతంలో చిరంజీవి కూడా షోల్డర్ సర్జరీ చేయించుకొన్న విషయం తెలిసిందే. ఇలాగే గతంలోనూ చాలా మంది హీరోలు ఈ విధంగా సర్జరీలు చేయించుకొన్నారు.
అయితే.. ఈ హీరోల సర్జరీల వార్తలు చదివినప్పుడల్లా సగటు జనాలకి వచ్చే సాధారణ ప్రశ్న ఏమిటంటే.. అసలు హీరోలు ఈ సర్జరీలు ఎందుకు చేయించుకొంటారు? అంత అవసరం ఏమొచ్చింది? అనే విషయం మాత్రం ఎవరికీ అర్ధం కాదు. జనరల్ గా క్రికెట్ ప్లేయర్స్ ఈ తరహా సర్జరీలు చేయించుకొంటారు. బ్యాటింగ్, బౌలింగ్ చేయడం వల్ల వారు ఈ సర్జరీలు చేయించుకొంటుంటారు. కానీ.. హీరోలు ఎందుకు చేయించుకొంటారు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అయితే.. కొందరు డాక్టర్లను సంప్రదించగా.. ఎక్కువగా ఎక్సర్ సైజులు చేయడం వల్ల వారు ఈ విధంగా సర్జరీలు చేయించుకొంటారని, ముఖ్యంగా ఎక్కువ డంబుల్స్ తో బరువులు మోయడం వల్ల షోల్డర్ సర్జరీలు ఎక్కువగా చేయించుకోంటుంటారట.