‘సైరా’ కు లైన్ క్లియర్.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు హై కోర్టు షాక్..!
October 1, 2019 / 06:42 PM IST
|Follow Us
గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి.. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ‘ ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ జీవిత చరిత్రని తప్పుదోవ పట్టిస్తున్నారని’… ఉయ్యాలవాడ వంశీయులతో పాటు తమిళనాడు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో సినిమా విడుదలను నిలిపివేయాలని కేసు పెట్టారు. దీంతో ‘సైరా’ టీం కు పెద్ద టెన్షన్ వచ్చి పడినట్టయ్యింది. సినిమా విడుదల టైం దగ్గర పడుతున్న టైంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటా అని మెగా అభిమానులు సైతం టెన్షన్ పడ్డారు.
ఇక ఈ కేసు పై విచారణ చేపట్టిన హైకోర్టు… ‘ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం విడుదలని ఆపలేమని స్పష్టం చేసింది. ‘సైరా’చిత్రం విషయంలో మేము ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోలేము. సినిమాను కేవలం వినోద పరంగానే చూడాలి. ఎంతో మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు ఎవరు చూపించారు..? గతంలో గాంధీ, మొఘల్‌ల సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను కూడా ఓసారి గుర్తుచేసుకోండి. సినిమా నచ్చేది… నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలి. ప్రస్తుతం సినిమాను మేము ఆపలేము’ అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణలో ‘సైరా’ విడుదలకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఉయ్యాలవాడ కుటుంబీకులు కూడా వారు పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.