Bigg Boss Show: బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
May 3, 2022 / 12:38 PM IST
|Follow Us
టీవీ రియాలిటీ షోల్లో కింగ్‌గా దూసుకుపోతున్న ‘బిగ్ బాస్’ షోపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. షోపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రముఖ టీవీ ఛానెల్లో, ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షోలో అసభ్యత, అశ్లీలత, హింస మించుతోందని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపైనే తాజాగా విచారణ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి ఇటీవల కోరడంతో… ధర్మాసనం సోమవారం విచారణ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పంవదిస్తూ… రియాల్టీ షోల పేరుతో మీకు నచ్చినట్లు ఏది పడితే అది ప్రసారం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి షోల విషయంలో తాము పట్టించుకోకుండా ఉండలేమంటూ హైకోర్టు స్పందించింది. రియాల్టీ షోలలో ఒకవైపు హింసను ప్రోత్సహిస్తూ, దాన్ని సంస్కృతి అని ఎలా అంటారని ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే.. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట విచారించమని అభ్యర్థించే అవకాశాన్ని పిటిషనర్‌కు వదిలేసింది. 2019లో ఈ వ్యాజ్యం దాఖలైందని, అత్యవసర విచారణ కోసం పది రోజుల కిందట హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర బెంచ్ ముందు అభ్యర్థించామని చెప్పారు. అయితే ధర్మాసనం అనుమతించలేదని పిటిషనర్ తెలిపారు. దీంతో ఇన్‌ఛార్జి కోర్టు ముందు విచారణ కోరమని అడిగామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
ఆ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం, సీజే బెంచ్ విచారణ జరిపేందుకు నిరాకరించిన విషయాన్ని తమ ముందు నిజాయతీగా ఒప్పుకొని ఉండాలని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ విషయంలో మళ్లీ సీజే బెంచ్ వద్ద అత్యవసర విచారణ కోసం అభ్యర్థించే వెసులుబాటును పిటిషనర్‌కే వదిలేసింది. దీంతో ఈ వ్యవహారం ప్రధాన న్యాయమూర్తి వద్దకే వెళ్లనుంది. ఆ తర్వాత షో విషయంలో ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేది చూడాలి.