దర్శకుడు వంశీ పైడిపల్లి కెరీర్ లో ఇప్పటివరకు అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే చేశారు. స్టార్ హీరోలనే డైరెక్ట్ చేశారు. ‘మున్నా’ను పక్కన పెడితే.. దాదాపు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ హిట్సే. కాకపోతే ఆయన పెట్టించే బడ్జెట్ కి భారీ లాభాలు అయితే రావని అంటుంటారు. ‘ఊపిరి’ సినిమాకి హిట్ టాప్ వచ్చినా.. కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ‘మహర్షి’ కూడా ఓవర్ బడ్జెట్ అయింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలిసొచ్చి నిర్మాతలు బయటపడిపోయారు.
ఇప్పుడు వంశీ ‘వారసుడు’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమాను ముందుగా బైలింగ్యువల్ అని చెప్పారు. కానీ ఇప్పుడేమో తమిళ సినిమాగా చెబుతున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ లో సినిమాపై బజ్ ఉంది కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం పట్టించుకోవడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి ‘ఆదిపురుష్’, ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ లాంటి భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
వాటితో పోటీపడి నిలబడాలంటే ‘వారసుడు’ సినిమాలో కంటెంట్ ఓ రేంజ్ లో ఉండాలి. ఇప్పుడేమో ఈ సినిమా డబ్బింగ్ సినిమా అంటున్నారు కాబట్టి ఆసక్తి పెద్దగా ఉండకపోవచ్చు. మరోవైపు తమిళంలో అజిత్ ‘తునివు’ అనే సాలిడ్ సినిమాతో వస్తున్నాడు. ‘వలిమై’ లాంటి హిట్ సినిమాను రూపొందించిన హెచ్.వినోత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వారసుడు’ సినిమా పోస్టర్స్, ప్రోమోలు చూస్తుంటే ‘మహర్షి’కి ఇంకో వెర్షన్ మాదిరి అనిపిస్తోంది.
ఈ సినిమాకి కూడా వంశీ బాగా ఖర్చు పెట్టిస్తున్నారు. బడ్జెట్ దాటేసినట్లు సమాచారం. కానీ రావాల్సినంత హైప్ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వంశీ హిట్టు కొట్టడం పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. మరేం జరుగుతుందో చూడాలి!