అయిదు నిమిషాల పాత్రైనా పర్లేదు, ప్రాముఖ్యత ఉండాలి – భూమిక

  • July 8, 2020 / 12:04 PM IST

‘ఖుషి’ సినిమాలో మధుమతిగా భూమిక చేసిన హల్ చల్ ను ఇంకా జనాలు మరువలేదు. రీసెంట్ గా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’లో వదినగా తన నటనతో, స్క్రీన్ ప్రెజన్స్ తో విశేషమైన రీతిలో అలరించింది భూమిక. “ఎం.సి.ఏ”తో మంచి రీఎంట్రీ ఇచ్చిన భూమిక తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి, తన ఫ్యూచర్ ప్రొజెక్ట్స్ గురించి అలాగే తన ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పిన విశేషాల సమాహారం మీకోసం..!!

మూడేళ్ళ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయితో రీఎంట్రీ..
నేను తెలుగులో నటించగా విడుదలైన ఆఖరి చిత్రం “లడ్డు బాబు”. ఆ తర్వాత నేను తెలుగు సినిమాకి దూరమయ్యాను. మళ్ళీ మూడేళ్ళ తర్వాత “మిడిల్ క్లాస్ అబ్బాయి”తో రీఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను వదిన పాత్రలో బాగా రిసీవ్ చేసుకొన్నారు.

నానీతో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది..
నాని తనకున్న బిరుదుకు తగ్గట్లే చాలా నేచురల్ ఆర్టిస్ట్. కెమెరా ముందుకి వచ్చేసరికి అతను చూపించే వేరియేషన్స్ కి నేనే షాక్ అయ్యేదాన్ని. మా మధ్య వదిన-మరిదిగా కెమిస్ట్రీ బాగా కుదిరింది. తను నన్ను ఆఫ్ ది స్క్రీన్ కూడా వదినలా చూసుకొనేవాడు. ఆ కెమిస్ట్రీ వల్లే తెరపై మా అనుబంధం ప్రేక్షకులు మనసుకు హత్తుకోగలిగారు.

మాటలు తక్కువే కానీ..
ఈ సినిమాలో నాకు డైలాగ్స్ చాలా తక్కువ. కానీ.. నా పాత్ర క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఎక్కువ. నిజానికి సినిమాలో నా పాత్ర వల్లే కథ మలుపు తిరుగుతుంది. అది నచ్చే నేను ఈ సినిమా ఒప్పుకొన్నాను. ఎప్పుడైనా సరే పాత్రకి కథలో ప్రాముఖ్యత ఉందా లేదా అనే చూస్తాను కానీ.. నిడివి గురించి పట్టించుకోను. ఒక భారీ బడ్జెట్ సినిమాలో 30 నిమిషాల రోల్ ఉంది కానీ ఏదో అలా పక్కకి నిల్చోవడమే అంటే అది యాక్సెప్ట్ చేయను. కానీ.. ఒక చిన్న సినిమాలో ఐదు నిమిషాలు కనిపించినా చాలు. ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే చాలు.

టాలీవుడ్ ఆ విషయంలో ఇంకా ఎదగాలండీ..
నేను హీరోయిన్ గా దాదాపు 10 ఏళ్లపాటు నటించాను. కానీ.. ఇప్పుడు వదిన రోల్ లో కనిపించేసరికి “అరే ఆవిడ ఏజ్ అయిపోయింది” అనో లేక “ఇంకా హీరోయిన్ అంటే కష్టమే” అని ఆలోచిస్తున్నారే తప్ప నేను పోషించే పాత్ర పరిధి గురించి కానీ.. ఆ పాత్రకున్న ప్రాముఖ్యత గురించి కానీ ఆలోచించడం లేదు. అలా అనుకుంటే.. హాలీవుడ్ లో మెరిల్ స్ట్రీప్ 65 ఏళ్ల వయసులోనూ మంచి సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ లో విద్యాబాలన్ తన వయసుకు తగ్గట్లు భార్యగా, తల్లిగా మంచి పాత్రల్లో నటిస్తోంది. ఐశ్వర్యరాయ్ 40 ఏళ్ళు వచ్చాక కూడా నటిస్తోంది. సో ఒక నటిగా చూడాలే కానీ వయసును బట్టి జడ్జ్ చేయడం అనేది మానేయాలి.

అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ ఒక్కడే మిగిలిపోయాడు..
“సవ్యసాచి”లో నాది చాలా చిన్న పాత్ర. ఇంకా చెప్పాలంటే స్పెషల్ అప్పీరియన్స్ అనుకోవచ్చు. నాగచైతన్యకు అక్కగా కనిపిస్తాను. అక్కినేని కుటుంబ కథానాయకులైన నాగార్జున, సుమంత్, నాగచైతన్యలతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. భవిష్యత్ లో అఖిల్ తోనూ నటిస్తానేమో.

నా డ్రీమ్ రోల్ అదే..
ఫలానా పాత్ర చేయాలని నేనెప్పుడూ కలలు కనలేదు. నా లక్ష్యం ఒకటే.. విభిన్నమైన పాత్రలు చేయాలి. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించడం అనేది రొటీన్ గా ఉండొచ్చు కానీ నా క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఉండేవి. ఇక గత అయిదారేళ్లుగా నేను నటిస్తున్న సినిమాలు చూస్తే నా సెలక్షన్ ఎలా ఉంది అనేది మీకు అర్ధమవుతుంది. అలాగే నా పాత్రలకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని ఉంటుంది కానీ.. సమయాభావం వల్ల చేయలేకపోతున్నాను. కుదిరితే “సవ్యసాచి”లో నా రోల్ కి నేనే డబ్బింగ్ చెప్పుకొంటాను.

ఆ ఒక్క జోనర్ లో మాత్రం సినిమా చేయను..
నన్ను హారర్ సినిమాలో నటించమని చాలా మంది అడుగుతుంటారు. ఈమధ్య “హారర్ కామెడీ” అనేది మోస్ట్ సక్సెస్ ఫుల్ జోనర్ అయిపోవడంతో అందరూ ఆ తరహా సినిమా చేయమంటున్నారు. నిజానికి నేను హారర్ సినిమాలు చూడ్డానికి కూడా ఇష్టపడను. అందుకే హారర్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపను.

ఆ రెండు సినిమాలు నాకు నటిగా సంతృప్తినిచ్చాయి..
నా కెరీర్ లో పదుల సంఖ్యలో సినిమాలు చేశాను. కానీ.. నా ఫేవరెట్ మాత్రం “అనసూయ, మిస్సమ్మ”. ఈ రెండు చిత్రాలు వైవిధ్యమైనవి మాత్రమే కాదు ఒక నటిగా నాలోని నట తృష్ణను సంతృప్తపరిచినవి కూడా. అందుకే ఆ రెండు సినిమాలు మోస్ట్ ఫేవరెట్.

నటిగానే కాక తల్లిగానూ నా బాధ్యతను నిర్వర్తించాలి కదా..
అవకాశాలు వస్తున్నాయి కదా అని వరుస సినిమాలు అంగీకరించలేను. ఎందుకంటే ఒక నటిగా నేను సినిమాలోని పాత్రకి న్యాయం చేయడంతోపాటు ఇంట్లో ఒక తల్లిగానూ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. నా కొడుకు యష్ ఠాకూర్ ఇప్పుడు నర్సరీ చదువుతున్నాడు. వాడ్ని చూసుకోవాలి కదా. అందుకే సెలక్టడ్ గా సినిమాలు చేస్తున్నాను.

మీకు అలా అనిపిస్తే కాస్త ప్రమోట్ చేయండి..
మీరే అంటున్నారు కదా నేనింకా హీరోయిన్ లాగే ఉన్నానని. కాస్త మీ పేపర్స్/వెబ్ సైట్స్ లో “భూమిక ఇంకా హీరోయిన్ లాగే ఉంది. ఆమెకి మంచి హీరోయిన్ ఆఫర్స్ ఇవ్వండి” అని కాస్త రాయండి (నవ్వుతూ..).

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus