మహేష్ తల్లిగా చేసిన నటి సీతామాలక్ష్మి గురించి ఆసక్తికర విషయాలు..!
July 16, 2022 / 04:51 PM IST
|Follow Us
బాలీవుడ్ లో సత్తా చాటి స్టార్స్ గా ఎదిగిన వారిలో చాలా మంది దక్షిణాది వారున్నారు. హేమమాలిని, శ్రీదేవి, జయప్రద, రామ్ గోపాల్ వర్మ, జానీ లివర్, ఎల్వీ ప్రసాద్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాలా పెద్దది. అలాంటి వారిలో ఒకరు తాళ్లూరి రామేశ్వరి. అచ్చ తెలుగు ఆడపిల్ల అయిన ఆమె హిందీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలెంట్ ఉంటే ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించిన వారిలో రామేశ్వరి కూడా ఒకరు.
ప్రతిష్టాత్మక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ)లో శిక్షణ తీసుకున్న రామేశ్వరికి.. కోర్సు కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన వెంటనే ఆఫర్లు వెల్లువెత్తాయి. దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా పక్కన ‘సునయన’ అనే సినిమా చేస్తుండగా రామేశ్వరి కంటికి గాయమైంది. దీని కారణంగా ‘అమర్ దీప్ ’లోంచి ఆమెను తీసేశారు. అంతేకాదు.. అనారోగ్యం దృష్ట్యా ‘ఆషా’ అనే సినిమాలోనూ తనంతట తానుగా తప్పుకున్నారు. కానీ రామేశ్వరి టాలెంట్ తెలిసిన నిర్మాత మాత్రం..
ఆమెకు నయమయ్యే దాకా నిరీక్షించి సినిమా తీశారు. దుల్హన్ వొహీ జో పియా మన్ భాయే’, అగ్ని పరీక్ష, ఆదత్ సే మజ్బూర్, ఆస్ ఔర్ ప్యాస్, అంధేరా ఉజాలా, వక్త్ వక్త్ కీ రాత్, ప్రతిభ, ద్రోహి, రోష్నీ వంటి వరుస హిట్లతో రామేశ్వరి పేరు బాలీవుడ్ లో మారుమోగింది. హిందీలో నిలదొక్కుకుంటూ.. స్టార్ గా ఎదుగుతున్న దశలో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ హీరోగా ఆమె నటించిన సీతామాలక్ష్మి విజయం సాధించింది.
మళ్లీ ఎందుకో రామేశ్వరి తెలుగులో హీరోయిన్ గా నటించలేదు. కానీ చేసింది ఒక్క సినిమానే అయినా తెలుగువారి గుండెలను హత్తుకున్నారు. అంతేకాదు ఆ ఏడాది ఉత్తమ నటిగా నంది అవార్డును సైతం గెలుచుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత 1988లో ‘చిన్నోడు పెద్దోడు’ సినిమాలో మరోసారి తెలుగులో నటించారు. ఆమె తెలుగులో హీరోయిన్ గా నటించిన రెండు సినిమాల్లోనూ చంద్రమోహనే హీరో కావడం విశేషం. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల వంక తిరిగి చూడలేదు రామేశ్వరి.
ఈ లోపు తన చిరకాల మిత్రుడు దీపక్ సేథ్ ను పెళ్లాడిన ఆమెకు ఇద్దరు కుమారులు. కుటుంబ బాధ్యతల నేపథ్యంలో రామేశ్వరి నటనకు దూరమయ్యారు. అయితే 2002లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రామేశ్వరి.. 2003లో సూపర్ స్టార్ మహేష్ బాబు- తేజ ల కాంబినేషన్ లో వచ్చిన ‘నిజం’ అనే సినిమాలో హీరోకు తల్లిగా నటించారు. అనంతరం నీలకంఠ దర్శకత్వంలో ‘నందనవనం 120 కి.మీ’ , ‘రౌడీ ఫెలో’ సినిమాలతో పాటు ‘అమెరికా అమ్మాయి’ సీరియల్ లో నటించి తెలుగు వారిని మెప్పించారు.