War 2: డైరక్టర్ రిస్క్ చేస్తున్నాడా? తారక్‌ని అలా చూపిస్తే… అభిమానులు ఊరుకుంటారా?
March 12, 2024 / 02:05 PM IST
|Follow Us
‘డూపెందుకు దండగ… హీరోను నేనుండగా’ అనే హీరోలున్న ఇండస్ట్రీ మనది. ఓ సీన్లో డూప్ నటించాడు అంటే ఠక్కున పట్టేసే ఫ్యాన్స్ ఉన్న ఇండస్ట్రీ కూడా మనది. ఇక ప్రత్యర్థి (?) హీరో ఫ్యాన్స్ అయితే ఎక్కడా దొరుకుతాడా అని సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ వెతుకుతుంటారు. ట్రోలర్లు అయితే దర్శకుడి అతి తెలివి సీన్లను పట్టేసి తూర్పారబట్టేస్తారు. ఇలాంటి ఇండస్ట్రీలో యాక్షన్ సన్నివేశాల్లో హీరో కాకుండా వేరొకరు నటిస్తే, అందులోనూ తలకాయ మార్చేసి సినిమా పూర్తి చేస్తానంటే బాగుంటుందా? అసలు అభిమానులు ఊరుకుంటారా? ఈ ప్రశ్నలకు కచ్చితంగా బాగోదు, ఊరుకోరు అనే ఆన్సరే వస్తుంది.
అయినా, ఇలాంటి ప్రయత్నం ఎవరు చేస్తారు, ఏ హీరో ముందుకొస్తారు అనుకుంటున్నారా? ఇంకెవరు ‘వార్ 2’ సినిమా కోసం అయాన్ ముఖర్జీ ఈ తరహా ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఆటోమేటిగ్గా ఆ హీరో ఎన్టీఆర్ (Jr NTR) అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘వార్ 2’ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అని ఎదురుచూస్తున్న తారక్ అభిమానులకు షాకింగ్ లీక్ న్యూస్ ఒకటి వచ్చింది. అదే మోషన్ గ్రాఫిక్స్ టెక్నాలజీని ఈ సినిమా కోసం వాడుతున్నారు అని.
దీని గురించి మీకు సులభంగా చెప్పాలి అంటే… ‘కోచ్చడయాన్’ సినిమా చూశారా? అదేనండీ (Rajinikanth) రజనీకాంత్ డిజాస్టర్ మూవీ. అందులో రజనీని బ్లూ మాట్ ముందు పెట్టేసి… ముఖ కవళికల్ని రికార్డు చేసి ఆ తర్వాత బొమ్మలుగా మార్చేసి చేశారే అది. మొన్నీమధ్య వచ్చిన ‘ఆదిపురుష్’ (Adipurush) విషయంలోనూ ఇదే చేశారని టాక్. ఆ టెక్నాలజీ శరీరాల కోసం ‘వార్ 2’లో వాడతారు అని అంటున్నారు. ఈ వార్తలో నిజానిజాలెంతో తెలియదు కానీ… వైరల్ అయితే అవుతోంది. యాక్షన్ సీన్స్ కోసం డూప్‌తో షూట్ చేసింది.
మోషన్ క్యాప్చర్ విధానంలో హీరోల తలకాయలు ఆ బాడీలకు అతికిస్తారు అంటున్నారు. ఆ లెక్కన (War 2) ‘వార్ 2’ సినిమా షూటింగ్లో హీరోలు ఉండరని, కేవలం టీమ్ మాత్రం సీన్స్ తీసేసి ఆ తర్వాత నూతన సాంకేతికతతో కలిపి కుట్టేస్తారని అంటున్నారు. ఒక విధంగా కొత్త సాంకేతికత కావొచ్చు కానీ… సినిమా అవుట్‌పుట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా అనేది అభిమానుల ప్రశ్న.