Dhoni: తొలి సినిమాతోనే ధోనీ నటుడిగా మారతాడా? క్లారిటీ వస్తుందా?
July 25, 2023 / 01:21 PM IST
|Follow Us
క్రికెట్లో తనదైన ముద్ర వేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పుడు సినిమాల్లోకి కూడా వస్తున్నాడు. అయితే అది నిర్మాతగా. భార్య సాక్షి నిర్మాతగా ధోనీ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థను ఏర్పాటు చేసి తొలిసారిగా తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు. అదే ‘ఎల్జీఎం’.. అంటే ‘లెట్స్ గెట్ మ్యారీడ్’. ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్న వేళ ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. విషయం అనే కంటే.. లీక్ అంటే సరిపోతుంది.
అదే ‘ఎల్జీఎం’లో ధోనీ నటించాడు అని. అవును, మీరు చదివిన పుకారు కరెక్టే. ఈ సినిమాలో ధోనీ కూడా ఉన్నాడు అంటూ బలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఎలాగూ ఈ సినిమా ప్రచారం కోసం ‘ఎల్జీఎం’ టీమ్ వచ్చింది కదా అని అడిగితే.. వాళ్లు కూడా క్లారిటీ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ కన్ఫ్యూజన్లో పడేశారు. దీంతో అసలు విషయం ఏంటి అనేది అర్థం కాకుండా పోయింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో ధోనీ ఉన్నది లేనిది క్లారిటీ లేదు అని చెప్పాలి.
అయితే సన్నిహిత వర్గాలు అయితే ఉన్నాడు అనే అంటున్నారు. హరీశ్ కల్యాణ్, ఇవానా జంటగా నటించిన చిత్రం ‘ఎల్జీఎం’. నదియ మరో ముఖ్యపాత్రధారి. ఈ సినిమాకు రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించారు. అత్తాకోడళ్ల మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. కొడుకుతో పెళ్లికి కాకుండా ముందు అత్తాకోడళ్లు హాలీడే ట్రిప్‌కి వెళ్తే ఎలా ఉంటుంది అనే అంశం నేపథ్యంలో సినిమా తెరకెక్కించారు. ఇటీవల వచ్చిన ట్రైలర్లో ఈ పాయింట్ మెన్షన్ చేశారు. దీనికి మంచి స్పందన కూడా వస్తోంది.
ఈ కథలోనే కీలక సమయంలో అతిథి పాత్రలో ధోనీ (Dhoni) కనిపిస్తాడని అంటున్నారు. నిర్మాతగా తొలి సినిమా కాబట్టి.. ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు. అయితే సాక్షిని ఈ విషయం అడిగితే.. సినిమా వచ్చేస్తోంది కదా.. అప్పుడు చూసి తెలుసుకుందురు అని సస్పెన్స్ కంటిన్యూ చేశారు. మరి ధోనీ ఉన్నాడా లేదా అనే విషయం తేలాలి అంటే… ఈ నెల 28 వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజే ‘ఎల్జీఎం’ రిలీజ్ అవుతోంది.