Acharya Movie: కంటెంట్ ఉన్న ఎప్పుడొచ్చినా ఫర్వాలేదా?
November 29, 2021 / 03:53 PM IST
|Follow Us
సిద్ధాస్ సాగా పేరుతో ‘ఆచార్య’ నుండి ఇటీవల ఓ టీజర్ వీడియో వచ్చింది. మీరు కూడా చూసే ఉంటారు. చరణ్ పాత్ర గురించి, లుక్ గురించి, సినిమా కాన్సెప్ట్ గురించి చక్కగా వివరించేలా టీజర్‌ను కట్ చేసింది చిత్రబృందం. ఈ టీజర్ వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో రెండు రకాల చర్చ అయితే నడుస్తోంది. ఒకటి పులి, పులి పిల్ల షాట్. రెండోది సినిమా రిలీజ్ డేట్. ‘ఆచార్య’ను ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించేసింది. అయితే అప్పుడు చిన్నగా ఉన్న చర్చ ఇప్పుడు పెద్దదైంది.
టాలీవుడ్ అనధికారికంగా అయినా అధికారికంగా అయినా చెప్పే మాట పెద్ద హీరోల సినిమాలు పండగ సీజన్లలో రావాలి. అందుకే సంక్రాంతి, సమ్మర్, దసరా రోజుల్లో సినిమాలు తీసుకొస్తుంటారు. ఆ లెక్కన చూస్తే ‘ఆచార్య’ ఆ సమయంలో రావడం లేదు. టాలీవుడ్లో అన్ సీజన్‌గా పిలిచే ఫిబ్రవరిలో సినిమా తీసుకొస్తున్నారు. పరీక్షల సమయం, ప్రిపరేషన్ సమయం కావడం వల్ల ఈ సమయంలో వసూళ్లు ఎక్కువగా ఉండవు అంటుంటారు. దీంతో సినిమా ఫిబ్రవరిలో వస్తే ఓకేనా అనే చర్చ నడుస్తోంది.
అన్‌సీజన్ మాటలు నమ్మే, చెప్పే ఇండస్ట్రీ… ఇంకో విషయం కూడా చెబుతూ ఉంటుంది. అదే కంటెంట్ ఉన్నవాడికి కటౌట్‌తో సంబంధం లేదు. కంటెంట్ ఉన్న సినిమాకు డేట్‌తో పని లేదు అని. ఆ లెక్కన సినిమాలో కంటెంట్ బలంగా ఉంది కాబట్టే అన్ సీజన్లో వస్తున్నారేమో అని అనుకోవచ్చు కదా అంటూ ‘ఆచార్య’ గురించి మరో రకం చర్చ కూడా నడుస్తోంది. వీటిలో ఏ చర్చ నెగ్గుతుందో తెలియాలంటే కష్టం కానీ. సినిమా విడుదలయ్యాక ఏది నిజమో తేలిపోతుంది. అంతా కొరటాల శివ చేతుల్లో ఉందనేది మాత్రం నిజం.