కళ్లు తెరిపించిన సినిమాలు… ఇక అలాంటి రిలీజ్లు కష్టమేనా?
November 3, 2023 / 10:54 PM IST
|Follow Us
కొత్తొక వింత.. పాతొక రోత అంటుంటారు పెద్దలు. అంటే కొత్తగా ఏం వచ్చినా అందరూ ఆదరిస్తారు అని. అయితే పాత విషయాన్నే మళ్లీ తీసుకొస్తే కొత్త అనుకుని ఆదరించే వాళ్లూ ఉన్నారు. అలాంటివాటిలో పాన్ ఇండియా ఒకటి. సౌత్ సినిమాలు నార్త్‌లోకి వెళ్లి విజయాలు అందుకోవడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. దానికి పాన్ ఇండియా అని పేరు కూడా పెట్టారు. అయితే గతంలో ఇలా చాలా సౌత్ సినిమాలు నార్త్‌కి వెళ్లాయి మరి. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే ఆ పాన్ ఇండియా ఫీవర్ తగ్గింది అంటున్నారు.
దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా చూసే సినిమాలను పాన్ ఇండియా సినిమాలు అంటారు. వివిధ భాషల్లో ఆ సినిమాలు వస్తుంటాయి. అలా ఇటీవల కాలంలో వచ్చిన తొలి సినిమా ‘బాహుబలి’. ఈ రెండు సినిమాలు బాలీవుడ్లో కూడా భారీ వసూళ్లు సాధించాయి. ఆ తర్వాత ‘పుష్ప’, ‘కేజీయఫ్’, ‘కార్తికేయ 2’, ‘కాంతార’ అంటూ కొన్ని సినిమాలు వరుస కట్టాయి. దీంతో మన దగ్గర హీరోలు, దర్శకులకు పాన్ ఇండియా ఫీవర్ పట్టుకుంది.
ఎలాంటి సినిమా చేసినా కాస్త కనెక్ట్ అవుతుంది అనుకుంటే పాన్ ఇండియా రిలీజ్ అనడం స్టార్ట్ చేశారు. అలా వచ్చిన సినిమాల్లో ఇటీవల కాలంలో ఎక్కువ శాతం బొక్క బోర్లా పడుతున్నాయి. సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేసినా అందరూ ఆశించిన కంటెంట్ లేకపోవడంతో ఖర్చు అయిపోతోంది తప్ప.. డబ్బులు రావడం లేదు. ‘అర్జున్ రెడ్డి’ ఊపుతో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ అని వచ్చాడు. ఆ తర్వాత ‘లైగర్’ అంటూ పాన్ ఇండియాకు వెళ్లే జనాలు లైట్ తీసుకున్నారు. ఇక ‘ఖుషి’ సంగతి సరేసరి అంటున్నారు.
‘కార్తికేయ 2’ విజయంతో ‘స్పై’ అంటూ నిఖిల్ వెళ్తే సైలెన్స్ చేసేశారు. నాని (Dasara) ‘దసరా’ను పాన్ ఇండియా రిలీజ్ చేసినా వసూళ్ల లెక్కలు మాత్రం కేవలం టాలీవుడ్‌కే పండగ అని చెప్పాయి. సమంత – గుణశేఖర్ కలసి ‘శాకుంతలం’ అంటూ వచ్చి అలా వెళ్లిపోయారు. ఇప్పుడు రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అంటూ పాన్ ఇండియా ప్రయోగం చేసి నిరాశపడ్డాడు. దీంతో అందరూ పాన్ ఇండియా అంటే కష్టం అనే చర్చ టాలీవుడ్లో జరుగుతోంది.