Ravi Teja: ‘ఖిలాడీ రిలీజ్ మాస్ మహరాజా వద్దన్నాడా?
February 7, 2022 / 05:28 PM IST
|Follow Us
కరోనా పరిస్థితులు అప్పుడప్పుడే సద్దుమణుగుతున్నాయి. థియేటర్లు తెరుచుకుంటున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనా ఉంది. ఆ సమయంలో ఎవరు సినిమాలు రిలీజ్ చేస్తారు, లాభాలు రావు అనుకొని చాలామంది వెనక్కి వెళ్లిపోయారు. కానీ రవితేజ ఎంతో ధైర్యంగా తన ‘క్రాక్’ సినిమాను విడుదల చేశారు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అయితే ఇదంతా గతేడాది. అంటే 2021. కానీ 2022కి వచ్చేసరికి. రవితేజ ఆలోచన మారిందా. ‘క్రాక్’ సినిమా సమయంలో ఉన్నంత ధైర్యం లేకుండా పోయిందా.
ఇప్పుడు సోషల్ మీడియాలో, టాలీవుడ్ వర్గాల్లో ఇదే చర్చ. కారణం ‘ఖిలాడీ’ సినిమా వాయిదా పుకార్లే. ముందుగా అనుకున్నట్లు ఫిబ్రవరి 11న ‘ఖిలాడీ’ సినిమా విడుదల చేయాలని రవితేజ అనుకోవడం లేదని టాక్ నడుస్తోంది. సినిమాను ఇంకో వారం వాయిదా వేద్దామని అంటున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుండటమే దానికి కారణమని సమాచారం. ఈ సమయంలో సినిమా రిలీజ్ చేస్తే వసూళ్ల విషయంలో ఇబ్బంది ఉంటుందని రవితేజ అనుకుంటున్నారని టాక్.
ఇందులో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ… చర్చ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇంకో వారం ఆగితే పరిస్థితులు బాగుపడి, జనాలు థియేటర్లకు వస్తారని ఆయన ఆలోచన. ఈలోపు ఏపీలో రాత్రి కర్ఫ్యూ కూడా తీసేస్తారు అని అనుకుంటున్నారట. అయితే ఫిబ్రవరి 25న సినిమాలు చాలానే ఉన్నాయి. 18న ‘ఖిలాడీ’ తీసుకొస్తే ఒక వారమే రన్ ఉంటుందని నిర్మాతల ఆలోచనట. అందుకే ఫిబ్రవరి 11 అయితే బెటర్ అని అనుకుంటున్నారట. ఈ చర్చ బయటకు వచ్చింది.
ఆఖరికి నిర్మాతల మాటలే నెగ్గింది అని సమాచారం. అయితే ఇక్కడ ఒకటే డౌట్. ‘క్రాక్’ సినిమా అప్పుడు అంత ధైర్యంగా రిలీజ్ చేసిన రవితేజ… ఇప్పుడు ‘ఖిలాడీ’ విషయంలో ఎందుకు వెనక్కి ఆలోచిస్తున్నట్లో. రవితేజ నుండి వరుస సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ‘ఖిలాడీ’ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ వచ్చేస్తుంది. ఆ వెంటనే ‘ధమాకా’ తీసుకొస్తారు. ఇవి కాకుండా రవితజ ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు ఓకే చేసేశాడు. అవి పట్టాలెక్కేశాయి కూడా.