Chiranjeevi: చిరంజీవి చెప్పిన ఆ దర్శకుల్లో కొరటాల కూడా ఉన్నారా?
May 2, 2022 / 01:12 PM IST
|Follow Us
కర్ణుడు చావుకి లక్ష కారణాలు అని అంటుంటారు. ఆ మాట నిజమో కాదో తెలియదు కానీ… ‘ఆచార్య’ సినిమా పరాజయానికి మాత్రం చాలా కారణాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. కథ, కథనం, దర్శకుడు, నటులు… ఇలా చాలానే కారణాలు చెబుతున్నారు విమర్శకులు. సినిమా చూశాక అవన్నీ నిజమనిపిస్తుంటాయి కూడా. అయితే వీటికి మరో కారణం కూడా యాడ్ చేయొచ్చు అనిపిస్తోంది. అయితే ఈ కారణం చెప్పింది చిరంజీవినే. ఈ సినిమా గురించి అని చెప్పకపోయినా, అన్యాపదేశంగా చిరంజీవి చెప్పిన ఓ మాట అలా అనుకునేలా చేస్తోంది.
‘ఆచార్య’ సినిమా ప్రచారంలో భాగంగా… ఇటీవల చిరంజీవి టాలీవుడ్ యువ దర్శకులతో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన అనుభవం, నేర్చుకున్న పాఠాల నుండి కీలకమైన విషయాలను వెల్లడించారు చిరంజీవి. ఈ క్రమంలో సెట్లో తాను ఎలా ఉంటాను అనే విషయం కూడా వివరించారు. దాంతోపాటు సినిమా కథలో మార్పులు సూచించడం, అవసరమైతే సన్నివేశాలే తిరగరాయించడం లాంటివి చేసేవాడినని కూడా చెప్పాడు చిరంజీవి.
ఆ క్రమంలో చిరంజీవి ఓ వ్యాఖ్య చేశారు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా కథ, కథనంలో దర్శకులు, రచయితలకు ఇన్పుట్స్ చెబుతానని, అయితే అవతలి వ్యక్తులు చెబుతున్న అంశాలకు తీసుకుంటూనే అలా చేస్తానని, ఒకవేళ పట్టించుకోకపోయినా, ఆ వ్యక్తిలో అలాంటి ఆలోచనే కనిపించకపోయినా.. ఓ బాలుడిలా సినిమా షూటింగ్‌కి వెళ్లి పని పూర్తి చేసి వచ్చేస్తానని చెప్పాడు చిరంజీవి. ఇప్పుడు ఈ మాటలే వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి ఆ మాటలు అన్నది ‘ఆచార్య’ సినిమాను ఉద్దేశించేనా అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. సినిమా గురించి, సినిమా దర్శకుల గురించి ఆ ఇంటర్వ్యూలో అంతసేపు మాట్లాడిన చిరంజీవి కొరటాల గురించి పెద్దగా గొప్పగా చెప్పిందేమీ లేదు. కొరటాల పాత సినిమాల గురించి కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. పోనీ సినిమాకు హైప్ వద్దనుకుని ఇలా చేశారు అనుకుందాం. కానీ సినిమా ఫలితం చూస్తుంటే ఆ రోజు చిరు చెప్పిన మాటలు ఈ సినిమా ఫలితాన్ని ముందే ఊహించి చెప్పినవా అనిపించకమానదు.