Vakeel Saab: టాలీవుడ్‌పై కరోనా మరోసారి దెబ్బేస్తుందా?
April 9, 2021 / 11:06 AM IST
|Follow Us
కరోనా సెకండ్ ఇన్నింగ్స్ మాంచి వాడీవేడీగా సాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వచ్చిన తొలి నాళ్లలో ఎన్ని కేసులు వచ్చేవో… ఇప్పుడూ అన్నే కేసులు రోజుకు నమోదవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఓ పది, 20 ఎక్కువే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో సినిమాలు వేయడం పట్ల చాలామంది గుర్రుగా ఉన్నారు. మొన్నామధ్య తెలంగాణ హైకోర్టు కూడా ఇదే విషయం ప్రస్తావించింది. దీంతో త్వరలో సినిమా థియేటర్ల విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. అందుకే ‘లవ్ స్టోరీ’ సినిమాను వాయిదా వేశారని టాక్.
థియేటర్ల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని ప్రభుత్వం సూచిస్తుందని అంటున్నారు. దీంతో పెద్ద సినిమాలు విడుదలకు సాహసం చేయకపోవచ్చు. మొత్తం డబ్బులు విడుదలైన తొలినాళ్లలో వసూలు చేసేయాలని బడా నిర్మాతలు చూస్తుంటారు. దీంతో ఇలా సగం థియేటర్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తే పెద్ద సినిమాలు రావు. ఆ లెక్కన ప్రజెంట్ సీజన్లో ‘వకీల్‌సాబ్’ ఆఖరి సినిమా అయ్యే అవకాశం ఉంది.
కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో చాలా సినిమాల తేదీలు ప్రకటించేశాయి. వరుసగా బాక్సాఫీసు మీద దండయాత్ర చేయడానికి సిద్ధమైపోయాయి. ఇప్పుడు అవన్నీ వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఈ కరోనా సెకండ్ ఇన్నింగ్స్ ఎంత వేగంగా ముగిసిపోతే జనాలకు అంత మంచింది. పనిలోపనిగా నిర్మాతలకూ మంచిదే. ఎందుకంటే అప్పుడే వాళ్లు పెద్ద సినిమాలు రంగంలోకి తీసుకొస్తారు కాబట్టి. చూద్దాం కరోనా ఆట ఎంతవరకు వస్తుందో.