Tollywood: నిర్మాతలకు అల్లు అరవింద్ మాటలు వినిపిస్తాయా!
June 6, 2022 / 12:57 PM IST
|Follow Us
‘ఆహా’ ఓటీటీ స్టార్ట్ చేసిన కొత్తలో అల్లు అరవింద్‌ని ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న అడిగాడు. కరోనా సమయం కాబట్టి ఇప్పుడు మీరు ఓటీటీ మీద దృష్టి పెడుతున్నారు, రేపొద్దున పరిస్థితులు కుదుటపడితే ఓటీటీని ఇదే స్థాయిలో ముందుకు తీసుకెళ్తారా? అని. దానికి ఆయన కచ్చితంగా అలానే చేస్తాను అన్నారు. అంతలా ఆయన అప్పుడు ఓటీటీని నమ్మారు. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ మాట మారింది. ఓటీటీ అంటే అంత ముద్దు లేదు అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే?
థియేటర్లకు ఓటీటీ దెబ్బ గట్టిగానే తాకుతోందని ట్రేడ్ వర్గాలు గత కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులు ఎవరూ ఇళ్ల నుండి థియేటర్లకు రావడం లేదని ట్రేడ్ వర్గాలు గ్రహించాయి. దీంతో సాధారణ టికెట్ ధరలు, తగ్గింపు ధరలు అంటూ ప్రోమోలు వేసుకొని మరీ సినిమాలకు కుటుంబ ప్రేక్షకుల్ని ఆహ్వానిస్తున్నారు. కానీ ప్రేక్షకుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. కారణం రెండు, మూడు వారాల్లో సినిమా ఓటీటీకి వచ్చేస్తుందిలే అని.
నిజానికి పరిస్థితి అలానే ఉంది. కొన్ని సినిమాలైతే విడుదలైన వారానికి, పది రోజులకే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీలో చూసేద్దాం అని ఆగుతున్నారు. పెద్ద సినిమాలైతే రెంటల్ పద్ధతిలో థియేటర్లలో సినిమా విడుదైలన మూడు వారాలకే వచ్చేస్తున్నాయి. ఇది థియేటర్ల రంగానికి మంచిది కాదు అని మనం మొన్నీమధ్య మన వెబ్సైట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఇదే మాట అన్నారు. థియేటర్లను రక్షించుకోవాలంటే ఓటీటీలను దూరం పెట్టాలని చెబుతున్నారు.
సినిమాలను థియేటర్లో వచ్చి చూసినప్పుడు పరిశ్రమ కలకల్లాడుతుందని, అందుకే అందరూ ఇదే తరహాలో ఆలోచించాలని అల్లు అరవంద్ చెబుతున్నారు. ఆయన ఓ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ టాలీవుడ్ – ఓటీటీ రిలీజ్ గురించి మాట్లాడారు. నేరుగా ఓటీటీ కోసం చేస్తున్న సినిమా అయితే ఓకే. కానీ థియేటర్లలో పడ్డ సినిమా ఓటీటీకి రావాలంటే గరిష్ఠ కాలం రెండు నెలల అయినా ఉండాలి అంటున్నారు ట్రేడ్ పరిశీలకులు. మరి నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి. దిల్ రాజు మాట వంటబట్టించుకుంటారో లేదో మరి.