యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం పోషించిన మూవీ జై లవకుశ. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్లు అంచనాలను పెంచేసాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఎన్టీఆర్ గత చిత్రాలు నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ సినిమాలకు దేవీ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. వరుసగా మూడోసారి ఇస్తున్న ఈ సినిమా పాటలు ఎలా ఉన్నాయంటే…
1. రావణనెగిటివ్ క్యారక్టర్ జై గురించి వివరించే పాటతోనే ఆల్బమ్ మొదలైంది. “రావణ” అనే పాటలో జై ఎలాంటి వాడో పూర్తిగా అర్థమైపోతుంది. రచయిత చంద్రబోస్ వేల వేల కోట్ల అగ్నిపర్వతాల కలయిక తో జై ని పోల్చారు. అంతేకాదు వికృతాల విద్యలన్నీ చదివిన వినాశక , అరాచక, అఘోర.. అంటూ ఎంత భయంకరుడో వివరించారు. ఆయన అందించిన సాహిత్యానికి గాయకుడు దివ్య కుమార్ గాత్రం మరింత గాంభీర్యాన్ని తెచ్చిపెట్టింది.
2. ట్రింగ్ ట్రింగ్లవకుమార్ అంటే రొమాన్స్ ఉండాల్సిందే. ఆ పాత్రకోసం క్యూట్ క్యూట్ పదాలతో ‘స్వప్న సుందరి, స్వర్ణ మంజరి’ అంటూ రామజోగయ్య శాస్త్రి పాట రాయగా, దేవీ కీ బోర్డు తో బీట్ జోడించి యూత్ హార్ట్ బీట్ ని టచ్ చేశారు. జస్ప్రీత్ జాజ్, రాని రెడ్డి లు ఆలపించిన ఈ పాటను ఎన్టీఆర్, రాశీ ఖన్నాలు తమ స్టెప్పులతో అదరగొట్టడం ఖాయం.
3. నీ కళ్ళలోనజై పాత్ర నెగటివ్ క్యారక్టర్ అయినప్పటికీ.. అతనికి ఓ లవ్ స్టోరీ ఉంది. తన ప్రేమను ప్రియురాలికి పాట ద్వారా చెప్పాడు. అందుకు చంద్రబోస్ కొత్త కొత్త ప్రయోగాలతో సాహిత్యాన్ని అందించారు. ప్రేమ, క్రూరం నిండితే ఎలా ఉంటుందో ఈ పాటలోనే చూపించారు. పెంచింది పడుచు పగ, పెదవులోని ఎరుపు నా పొగరుకు గాయం.. అనే సాహిత్యం కొత్తగా ఉంది. సంగీతం కూడా వినూత్నంగా ఉంది. హేమ చంద్ర తన గొంతులో రెండు వేరియేషన్స్ చూపించారు. అందుకే ఈ పాట ఎక్కువమందిని ఆకర్షిస్తోంది.
4. దోచేస్తాప్రజల సంతోషంగా భావించే వ్యక్తి కుశ అని దోచేస్తా అనే పాట ద్వారా చెప్పారు. “మీ కష్టాలన్నీ దోచేస్తా, మీ కన్నీళ్ళనీ దోచేస్తా” అంటూ మొదలయ్యే ఈ పాట చాలా ఉత్సాహంగా సాగుతోంది. చంద్రబోస్ సామాన్య పదాలతో అందంగా పాటను రాశారు. నాకాష్ అజిజ్ ఎన్టీఆర్ ఎనర్జీ కి తగినట్లు పాడారు. దేవీ మాత్రం ఎన్టీఆర్ మాస్ స్టెప్పుల కోసమన్నట్టు పాట చివర్లో డప్పు దరువులతో అదరగొట్టారు.
ఎన్టీఆర్ అభిమానుల మనసు తెలిసిన సంగీత దర్శకుడని రాక్ స్టార్ ఈ ఆల్బం ద్వారా దేవీ మరోసారి నిరూపించుకున్నారు. మూడు పాత్రలున్న ఈ చిత్రంలో నాలుగుపాటలు మాత్రమేనా.. అనే కొంత నిరుత్సాహమున్నా నాలుగింటితో ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచారు. ఈ నాలుగింటికి నాలుగు రకాల ఎక్స్ ప్రెషన్ ఉండేలా దేవీ జాగ్రత్త తీసుకొని విజయం సాధించారు. అంతేకాదు అభిమానులకు మరో పాటను గిఫ్ట్ గా ఇవ్వనున్నారు. ఈ ఐదో పాట త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశకి దేవీ అందించిన ట్యూన్స్ మరింత బలాన్ని సమకూర్చాయి.