జై లవకుశ

  • September 29, 2017 / 10:22 AM IST

యంగ్ టైగర్ ఎన్టీయార్ తొలిసారి త్రిపాత్రాభినయం పోషించిన సినిమా “జై లవకుశ”. “జనతా గ్యారేజ్” లాంటి సూపర్ హిట్ అనంతరం ఎన్టీయార్ నటిస్తున్న సినిమా కావడం.. స్వంత నిర్మాణ సంస్థ అయిన “ఎన్టీయార్ ఆర్ట్స్” బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా రూపొందిన సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అన్నిటికంటే ముఖ్యంగా.. సినిమాలోని “జై” క్యారెక్టర్ టీజర్ క్రియేట్ చేసిన హైప్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. మరి “జై లవ కుశ” ఆ అంచనాలను అందుకోగలిగాడా లేదా అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ : జై/లవ/కుశ (ఎన్టీయార్) ముగ్గురు కవల పిల్లలు. అయితే.. నత్తి ఉన్న ఏకైక కారణంగా “జై”కు ఎవరూ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎప్పుడూ “లవ, కుశ”లనే బాగా చూసుకొంటుంటారు. అలాంటి నేపధ్యంలో తమ్ముళ్ళు తనను డామినేట్ చేయడం, అందరూ తనకంటే వాళ్ళకే ఎక్కువ వేల్యూ ఇవ్వడం వంటి కారణాల వలన స్వంత తమ్ముళ్లనే చంపాలన్నంత కోపంతో ఓ ఘాతకానికి ఒడిగడతాడు. ఒక యాక్సిడెంట్ లో విడిపోయిన ముగ్గురు అన్నదమ్ముళ్లలో ముందు.. “లవ, కుశ” కలుస్తారు. ఒకరికొకరు సహాయపడుతూ.. వారి వారి సమస్యల నుంచి బయటపడాలనుకొనేలోపు.. వారి జీవితాల్లోకి హటాత్తుగా రీఎంట్రీ ఇస్తాడు జై. చిన్నప్పుడు తన స్వార్ధం కోసమే తమ్ముళ్లను చంపాలనుకొన్న జై.. మళ్ళీ అదే శైలి స్వార్ధంతో తన లాభం కోసం ఇద్దరు తమ్ముళ్లను తన వద్దకు రప్పించుకొంటాడు. అసలు చిన్నప్పుడే చంపేయాలనుకొన్న తమ్ముళ్ళు లవ, కుశలను జై మళ్ళీ ఎందుకు తన వద్దకు పిలిపించుకొన్నాడు? వారి కారణంగా జై పొందాలనుకొన్న లాభం ఏమిటి? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాల సమాహారమే “జై లవకుశ” చిత్రం.

నటీనటుల పనితీరు : లవుడిగా, కుశుడిగా ఎన్టీయార్ కొత్తగా చూపించింది ఏమీ లేదు. లవ పాత్ర “నాన్నకు ప్రేమతో” సినిమాలోని ఎమోషనల్ అభిరామ్ ను తలపించగా.. కుశ క్యారెక్టర్ “యమదొంగ” చిత్రంలోని కన్నింగ్ రాజా రోల్ ను రిమైండ్ చేస్తుంది. కానీ.. “జై” పాత్రలో ఎన్టీయార్ నటన “నభూతో.. నభవిష్యత్” అన్న చందాన ఉంది. ఆ కళ్ళలో పలికించిన క్రౌర్యం, అదే కళ్ళతో పండించిన ఎమోషన్ ను చూసి ఆశ్చర్యపోని ప్రేక్షకుడు ఉండడు. ఎన్టీయార్ ను హీరోగా కాక ఒక నటుడిగా జనాల హృదయాల్లో చిరకాలం గుర్తుండిపోయేలా చేసే సినిమా “జై లవకుశ” అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాకు ఎన్టీయార్ బెస్ట్ యాక్టర్ గా మాత్రమే కాక బెస్ట్ విలన్ అవార్డ్స్ కూడా గెలుచుకోవడం ఖాయం. నివేదా థామస్ తో కంపేర్ చేస్తే.. రాశీఖన్న పాత్ర నిడివే ఎక్కువైనప్పటికీ ఇంపార్టెన్స్ మాత్రం నివేదా థామస్ కే ఎక్కువ. పెర్ఫార్మెన్స్ విషయంలోనూ నివేదా సహజమైన నటనతో ఆకట్టుకొంది. సాయికుమార్ సపోర్టింగ్ రోల్ లో మెప్పించగా.. ప్రవీణ్, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హంసానందిని తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : దేవిశ్రీప్రసాద్ నేపధ్య సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్. రెట్రో మ్యూజిక్ కి ఫ్యూజన్ మిక్స్ ఇచ్చి దేవి కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ మాత్రమే కాదు.. ఎమోషన్ ను కూడా విశేషంగా ఎలివేట్ చేసింది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ భారీతనాన్ని ఎలివేట్ చేసింది. అయితే.. మూడు పాత్రలూ ఒకేసారి తెరపై కనిపించే సన్నివేశాల్లో సీజీ వర్క్ కాస్త ఎఫెక్టివ్ గా ఉంటే బాగుండేది. అలాగే.. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ రెగ్యులర్ గా అనిపించాయి. కెమెరా పరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఆడియన్స్ కాస్త ఇన్వాల్వ్ అయ్యేవారేమో. ముఖ్యంగా.. క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఎన్టీయార్ తన నట విశ్వరూపంతో అచ్చెరువుగొలుపుతుంటే.. యాక్షన్ ఎపిసోడ్ కాస్త అతి అనిపించింది. అందువల్ల ఎన్టీయార్ పండించిన ఎమోషన్ ను ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ వరకూ పర్లేదు కానీ.. సగటు సినిమా అభిమానులు ఆస్వాదించడం కష్టం. ఆర్ట్ వర్క్ కూడా సినిమాకి పెద్ద ఎస్సెట్ అని చెప్పుకోవచ్చు. నాటకం బ్యాగ్రౌండ్స్, జై క్యారెక్టర్ బ్యాగ్రౌండ్.. ఇలా అన్నీ అద్భుతంగానే ఉన్నాయి. కోన వెంకట్ సమకూర్చిన స్క్రీన్ ప్లే కాస్త రొటీన్ గా ఉండడం, ఎన్టీయార్ డైలాగ్స్ మినహా వేరే క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ గుర్తుండే స్థాయిలో లేకపోవడం మైనస్.

డైరెక్టర్ బాబీ చాలా రొటీన్ స్టోరీని కేవలం ఎన్టీయార్ పెర్ఫార్మెన్స్, ఫ్యాన్ బేస్ ను దృష్టిలో ఉంచుకొని రాసుకొన్నాడు. మూడు పాత్రల్లో ఎన్టీయార్ విశేషమైన వేరియేషన్స్ చూపిస్తూ టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది కానీ.. నటన విషయంలో, ఆహార్యం విషయంలో ఏమాత్రం తేలిపోయినా సినిమా అటకెక్కేది. కొన్ని సన్నివేశాల కంపోజిషన్ మరీ ఓల్డ్ గా ఉంటుంది, అలాగే క్లైమాక్స్ లో ఎమోషన్ ను ఎన్టీయార్ అద్భుతంగా పండించి.. కేవలం తన నటనతో సన్నివేశాన్ని రంజింపజేశాడు లేదంటే.. డైరెక్టర్ గా బాబీ దారుణంగా ఫెయిల్ అయ్యేవాడు. ఎన్టీయార్ నటవిశ్వరూపం దర్శకుడిగా బాబీ మైనస్ పాయింట్స్ ను కవర్ చేసింది అనేది తప్పక ఒప్పుకోవాల్సిన పచ్చినిజం.

విశ్లేషణ : ఎన్టీయార్ నటవిశ్వరూపం కోసం, “జై” పాత్రలో ఎన్టీయార్ పండించిన ఎమోషన్ కోసం “జై లవకుశ” చిత్రాన్ని ఆయన అభిమానులు ఎన్నిసార్లు చూసినా తప్పులేదు. కానీ.. రెగ్యులర్ మూవీ ఆడియన్స్ మాత్రం కాస్త బోర్ ఫీలవుతారు. విపరీతమైన మాస్ ఎలివేషన్ సీన్స్, ఎమోషన్, కుశ పాత్ర కామెడీ, కలగలిసి ఈ దసరా రేస్ లో ఎన్టీయార్ ను ధృడంగానే నిలబెట్టాయి. వచ్చేవారం విడుదలయ్యే “స్పైడర్” రిజల్ట్ ను బట్టి.. విన్నర్ ఎవరు అనేది డిక్లేర్ అవుతుంది. అయితే.. రెండు సినిమాలు విజయం సాధించి చిత్రసీమ వరుస సక్సెస్ లతో కళకళలాడాలని “ఫిల్మీ ఫోకస్” మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.

రేటింగ్ : 2.5/5

Note: ఈ రివ్యూ మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus