Jd Chakravarthy: బూతులు ఉన్నాయనే ఆ బ్లాక్‌బస్టర్ సినిమాలు చూశారా: జేడీ చక్రవర్తి
August 3, 2023 / 04:28 PM IST
|Follow Us
జేడీ చక్రవర్తి… నటుడిగా, దర్శకుడిగా తనొక డిఫరెంట్ జోనర్‌ను క్రియేట్ చేసుకున్నారు. అందరూ చేసే సినిమాలు చేస్తూనే, కొత్తగా ట్రై చేయడం ఆయనకు అలవాటు. అలాగే మాటల విషయంలోనూ ఆయన డిఫరెంట్‌గానే కనిపిస్తాడు, వినిపిస్తాడు కూడా. అలాంటి జేడీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4 నుండి స్ట్రీమ్ అవ్వనుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జేడీ ఓటీటీ సినిమాలు, సెన్సార్ విషయం మీద ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
వెబ్‌సిరీస్ అనేసరికి అసభ్యకరమైన సన్నివేశాలు, సంభాషణలు ఉంటాయి అనే ఓ అభిప్రాయం ఈ మధ్య ఏర్పడిపోయింది. దీని గురించి ఆయన దగ్గర ప్రస్తావిస్తే… ఒకప్పుడు హీరోయిన్ పొట్టి బట్టలు వేస్తేనే సినిమాలు ఆడతాయి అనే ఒక అపవాదు ఉండేది. ఆ తర్వాత అది నిజం కాదని తేలిపోయింది. సినిమాని సినిమాగా చూడటానికే ప్రేక్షకులు వస్తారు అని నిరూపించారు. అయితే దర్శకులకి కథపై నమ్మకం లేనప్పుడే ఇలాంటి సన్నివేశాల్ని, మాటల్ని పెట్టే ఆలోచన చేస్తారు అని కామెంట్ చేశారు జేడీ చక్రవర్తి.
అంతేకాదు ఈ విషయంలోకి టాలీవుడ్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమాలను కూడా లాగాడు. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు అలాంటి సన్నివేశాలు, బూతులు ఉన్నాయనే ప్రేక్షకులు చూశారా అంటూ తిరిగి ప్రశ్నించారు. అలాగే ఓటీటీకి సెన్సార్ అవసరమా అనే కాన్సెప్ట్ గురించి కూడా జేడీ మాట్లాడాడు. సినిమా లేదా సిరీస్.. ఏదైనా సరే తీసే దర్శకుడి బుర్రకి సెన్సార్ ఉండాలి. ఈ విషయంలో దర్శకుడు అనుకుంటే సినిమాకి కూడా సెన్సార్ అవసరం లేదు అని కామెంట్ చేశారు.
సినిమా, సిరీస్‌కు కథ సిద్ధం చేస్తున్నప్పుడు, స్క్రీన్‌ప్లే రాస్తున్నప్పుడు, మాటలు రాసేటప్పుడు నాలుగు గోడల మధ్య తేలిపోయే వ్యవహారం అది. దీనికి మళ్లీ సెన్సార్ అనే ఆలోచన అక్కర్లేదు. అందుకే వెబ్‌సిరీస్‌లు సిద్ధం చేసేటప్పుడే ఆలోచించుకుంటూ రాస్తే సెన్సార్ సమస్యే ఉండదు అని చెప్పారు (Jd Chakravarthy) జేడీ.