రాజశేఖర్ నటించిన తాజా చిత్రం ‘కల్కి’ గత శుక్రవారం విడుదలై డివైడ్ టాక్ మూటకట్టుకుంది. ‘పి.ఎస్.వి.గరుడ వేగ’ వంటి చిత్రంతో దాదాపు 10 ఏళ్ళ తరువాత హిట్టందుకున్నాడు రాజశేఖర్. అయితే ‘కల్కి’ చిత్రానికి ఆశించిన స్థాయిలో టాక్ గానీ.. కలెక్షన్లు గానీ రావట్లేదు. అయినప్పటికీ జీవిత,రాజశేఖర్ ఈ చిత్రం హిట్టయ్యింది మంచి కలెక్షన్లు వస్తున్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు రాజశేఖర్ నివాసంలో ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమధానం చెప్పుకొచ్చారు జీవిత. అయితే ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ ‘కల్కి’ చిత్రం దర్శత్వంలో మీరు జోక్యం చేసుకున్నారటగా’ అని ఆ విలేకరి అడిగిన ప్రశ్నకు జీవిత సమాధానమిస్తూ…. “ఈ విషయం పై మీడియాకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. దాదాపు 20 కోట్ల పైగా బడ్జెట్ తో మేము ఈ సినిమాని నిర్మించాం. సినిమా నిర్మాతలమైన మాకు డైరెక్టర్ తెరకెక్కించే విధానం నచ్చాలి కదా.. ముందుగా ‘కల్కి’ మూవీ చిత్ర యూనిట్ మొత్తానికి నచ్చితేనే 10 కోట్ల మంది ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది.
సినిమా గురించి తెలియని దాన్ని కాదు.. 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటున్నాం. మేమెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను రూపొందించిన చిత్రాలు బాగా ఆడినా.. ఆడకపోయినా.. దర్శకత్వంలో నాకు పట్టు ఉన్న మాట వాస్తవం. నా అనుభవాన్ని ఎవ్వరూ కాదనలేరు. సినిమా మాది కాబట్టి అందులో మా జోక్యం తప్పనిసరిగా ఉంటుంది. మీరెందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు.. దర్శకుడికి మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చారా ఈ విధంగా ప్రశ్నలు అడగాలి అంటూ” మీడియాపై జీవిత కోపంతోనే సున్నితంగా సమాధానమిచ్చారు.