మార్వెల్ సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు జెరెమీ రెన్నెర్. ‘ఎవెంజర్స్’ సినిమాలు ఆయన క్రేజ్ ని మరింత పెంచాయి. రీసెంట్ గా ఈ నటుడు ప్రమాదానికి గురయ్యారు. మంచు చరియలు విరిగిపడడంతో తీవ్రంగా గాయపడ్డారు జెరెమీ. దీంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందించారు. వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది.
జెరెమీ రెన్నెర్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటికీ ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ.. ప్రాణాలకు ఇబ్బంది లేదని చెప్పారు డాక్టర్స్. మొదట ఆయన పరిస్థితి గురించి ఏం చెప్పలేమని డాక్టర్స్ వెల్లడించినప్పటికీ.. ఆ తరువాత బెటర్ ట్రీట్మెంట్ అందించడంతో ఆయన కోలుకుంటున్నట్లు చెప్పారు. తాజా ప్రకటనతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.. జెరెమీ రెన్నర్ అమెరికాలోని మౌంట్ రోజ్ స్కీ తాహో పక్కనే నివసిస్తుంటారు. ఈ ప్లేస్ లో కొన్ని రోజులుగా ఎక్కువ మొత్తంలో మంచు కురుస్తుంది. మంచు ధాటికి ఆ ప్రాంతంలో రవాణా, విద్యుత్ వ్యవస్థలు స్తంభించాయి. రెండు రోజులుగా అక్కడి ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. జెరెమీ రెన్నర్.. ఇంటి పైకప్పుపై మంచు గడ్డ కట్టడంతో దాన్ని తొలగించేందుకు ప్రయత్నించారాయన.
ఆ సమయంలో మంచు పెద్ద ఎత్తున విరిగి ఆయనపై మీద పడింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని హెలికాప్టర్లో హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం అతడిని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. జెరెమీ రెన్నర్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇండియాలో కూడా అతడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.