జెస్సీ

  • March 15, 2019 / 08:49 AM IST

నాటకం ఫేమ్ ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “జెస్సీ”. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పోస్టర్స్మ్ ట్రైలర్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు రేకెత్తించాయి. శ్వేతా సింగ్ నిర్మించిన ఈ చిత్రం నేడు (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కొత్త దర్శకుడు అశ్వినీకుమార్ ఈ హారర్ థ్రిల్లర్ ఏ విధంగా తెరకెక్కించాడో చూద్దాం..!!

కథ: జెస్సీ (నషిమా అగర్వాల్) ఆమె చెల్లెలు అమీ (శ్రీతా చందన) ఇద్దరూ హార్స్లీ హిల్స్ దగ్గరలోని విక్టోరియా ప్యాలస్ లో ఉంటుంటారు. అప్పటివరకూ బాగానే ఉన్న జెస్సీ చెల్లెలు అమీ.. ఉన్నట్లుండి దెయ్యం పట్టినదానిలా ప్రవర్తించడం, అందరినీ భయపెట్టడం మొదలెడుతుంది. వాళ్ళకి సహాయపడడానికి ఇన్స్పెక్టర్ రమేష్ నారాయణ్ (అతుల్ కులకర్ణి), ఎగ్జార్జిస్ట్ (భూతాల మాంత్రికుడు) కబీర్ సింగ్ ప్రయత్నిస్తుంటారు. కానీ.. దెయ్యం పట్టింది అమీకి కాదని, జెస్సీకి అని తెలియడంతోపాటు.. ఇప్పుడు విక్టోరియా ప్యాలస్ లో అమీ, జెస్సీలుగా ఉంటున్నది అసలు వాళ్ళు కాదని కూడా తెలుసుకొంటారు.

ఇంతకీ జెస్సీ, అమీ పేర్లతో విక్టోరియా ప్యాలస్ లో ఉంటున్నది ఎవరు? అసలు వాళ్ళలో ప్రవేశించిన ఆత్మ ఎవరిది? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన చిత్రమే “జెస్సీ”.

నటీనటుల పనితీరు: నాటకం చిత్రంలో కేవలం తన అందచందాలను మాత్రమే బహిర్గతపరిచిన ఆషిమా నర్వాల్ ఈ చిత్రంలో జెస్సీగా టైటిల్ పాత్ర పోషించి పర్వాలేదనిపించుకుంది. క్రిస్టియన్ అమ్మాయిగా ఆహార్యం ప్రకారం సరిపోయింది కానీ.. ఆమె హావభావాల ప్రకటనలో ఇంకాస్త చొరవ చూపించి ఉంటే ఆ పాత్రలో ప్రేక్షకులు ఇంకాస్త ఎక్కువగా లీనమయ్యేవారు.

అమీ పాత్రలో శ్రీతా చందన కూడా ఆకట్టుకొంది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉండడం వలన మొదటి సినిమా అయినా ఎక్స్ పీరియన్స్ ఉన్న నటిలా ఆకట్టుకొంది శ్రీతా చందన. టామ్ బాయిష్ క్యారెక్టర్ లో పావని గంగిరెడ్డి, ఆమె స్నేహితులుగా అభినవ్ గోమటం, అభిషేక్ మహర్షి, అర్చన శాస్త్రి కూడా అలరించారు. నటి అర్చన పోషించింది చిన్న పాత్రే అయినా.. చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆమె పోషించిన చెప్పుకోదగ్గ పాత్రలో ఈ చిత్రం నిలుస్తుంది. కీలకపాత్రల్లో కబీర్ సింగ్, అతుల్ కులకర్ణి సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచారు.

సాంకేతికవర్గం పనితీరు: శ్రీచరణ్ పాకాల సంగీతం, విష్ణు సౌండ్ డిజైనింగ్ “జెస్సీ” చిత్రానికి ఒక రియలిస్టిక్ హారర్ ఫీల్ ను ఇచ్చాయి. రెగ్యులర్ హారర్ సినిమాల్లా విచిత్రమైన సౌండ్స్ తో కాకుండా ఒక పద్ధతి ప్రకారం అందించిన నేపధ్య సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అలాగే.. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఒక చిన్న సినిమా లేదా ఒక లో బడ్జెట్ సినిమా చూస్తున్నామనే భావన ప్రేక్షకుడికి రానివ్వదు. విజువల్స్, ఫ్రేమ్స్ ఎంత రిచ్ గా ఉన్నాయంటే.. ఇదొక 15 కోట్లు పెట్టి తీసిన సినిమా అన్నా కూడా జనాలు నమ్మేసేంత. అలాగే.. దర్శకుడు పాయింటాఫ్ వ్యూను సరిగ్గా క్యాచ్ చేసి ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎడిటర్ గ్యారీ బీ.హెచ్ ను కూడా మెచ్చుకోవాల్సిందే.

అలాగే.. మహిళా నిర్మాత అయినప్పటికీ కథను నమ్మి, అవుట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి కావాల్సినంత ఖర్చుపెట్టిన శ్వేతా సింగ్ ను అభినందించాలి. దర్శకుడు అశ్విని కుమార్ చిత్ర మూల కథను ఓ కొరియన్ సినిమా ద్వారా ఇన్స్పైర్ అయినప్పటికీ.. కథనాన్ని మాత్రం బాగా రాసుకొన్నాడు. అలాగే.. హారర్ సినిమా అనగానే జంప్ స్కేర్ షాట్స్ పెట్టేసి భయపెట్టాలని ప్రయత్నించకుండా.. ఆసక్తికరమైన కథనంలో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేశాడు. కాకపోతే.. కొందరు నటీనటుల నుంచి కథలోని ఎమోషన్ కి తగ్గట్లుగా నటనను రాబట్టుకోలేకపోయాడు. మెయిన్ ట్విస్ట్ ను ఇంకాస్త క్లారిటీగా, అర్ధవంతంగా వివరించి ఉంటే ప్రేక్షకుడికి అసలు ఏం జరిగింది అనేది క్లారిటీగా అర్ధమయ్యేది.

విశ్లేషణ: తెలుగు నుంచి ఈమధ్యకాలంలో వచ్చిన మంచి హారర్ చిత్రాల్లో “జెస్సీ” ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే మాత్రం కచ్చితంగా ఆకట్టుకొనే సినిమా ఇది. కాకపోతే.. మెయిన్ లీడ్ లో ఎక్స్ ప్రెషన్స్ ను బ్యాగ్రౌండ్ స్కోర్ బట్టి మనమే అర్ధం చేసుకోవాలి.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus