2023 మార్చి 13.. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు తల తిప్పి చూసిన, ఆశ్చర్యపోయిన రోజు.. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు గర్వంతో తల పైకెత్తేలా చేసిన రోజు.. ఏళ్ల తరబడి నెలకొన్న నిరీక్షణకు తెర పడిన రోజు.. టాలీవుడ్‌కి ప్రపంచ సినీ దిగ్గజం హాలీవుడ్ సలాం కొట్టిన రోజు.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఆస్కార్ గెలుచుకున్న రోజు.. జక్కన్న తెలుగు సినిమాని ప్రపంచపటంలో గుర్తుండిపోయేలా నిలబెట్టిన రోజు..
కొద్ది రోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ టీం దీని కోసం ఎంత కష్టపడుతున్నారో తెలిసిందే.. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది.. తెలుగు సినిమాకి కలగానే మిగిలిపోయిన అకాడమీ అవార్డు ‘నాటు నాటు’ పాటతో సాకారమైంది.. తెలుగు సినిమా ఆస్కార్ అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించిందనే విషయం ఇంకా షాకింగ్‌గానే ఉంది.. సినీ ప్రియులైతే ఈ మెమరబుల్ మూమెంట్‌ని సంబరాలు చేసుకుంటున్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొని, బుధవారం (మార్చి 15) తెల్లవారు ఝామున హైదరాబాద్ తిరిగి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు అభిమానులు..
తారక్ వస్తున్నాడని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు విమానాశ్రయానికి చేరుకున్నారు.. ‘జై ఎన్టీఆర్’ నినాదాలతో ప్రాంగణమంతా హోరెత్తిపోయింది.. అలాగే ఆస్కార్ సాధించిన అనంతరం భర్త స్వదేశానికి చేరుకోవడంతో రిసీవ్ చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా ఎయిర్ పోర్టుకి వచ్చారు.. ఆమెను చూడగానే అభిమానులు మరింత కోలాహలంగా నినాదాలు చేశారు..
ఈ సందర్భంగా తన ఆనందాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు తారక్.. ఆస్కార్ అవార్డ్ పట్టుకున్నప్పుడు చాలా బరువుగా.. మన దేశం ఎంత బరువుగా ఉందో అవార్డ్ కూడా అంతే బరువుగా ఉందని.. గర్వంగా ఉందని.. అవార్డ్ వచ్చిన విషయాన్ని మొట్టమొదటగా తన భార్యకు ఫోన్ చేసి చెప్పానని.. రాజమౌళి చేతిలో ఆస్కార్ అవార్డ్ చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.