Kalapuram Review: కళాపురం సినిమా రివ్యూ & రేటింగ్!
August 26, 2022 / 07:07 PM IST
|Follow Us
“పలాస, శ్రీదేవి సోడా సెంటర్, మెట్రో కథలు” వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన శైలిని క్రియేట్ చేసుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “కళాపురం”. పవన్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో ఈ చిత్రంకి కాస్త క్రేజ్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీసి.. దర్శకుడిగా తన పేరును వెండితెరపై చూసుకోవాలని కలలు కంటుంటాడు కుమార్ (సత్యం రాజేష్). అయితే.. అనుకోని విధంగా ఓ నిర్మాత తనని వెతుక్కుంటూ రావడం, సగం షూటింగ్ తన స్వంత ఊరైన కళాపురంలో తీయాలని కోరడంతో.. తన స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్తాడు. ఆ ఊర్లో ఎలక్షన్స్ కారణంగా అనుకోకుండా సినిమా షూటింగ్ డిలే అవుతుంది. కుమార్ తన డ్రీమ్ ప్రొజెక్ట్ ను కళాపురంలో షూట్ చేయగలిగాడా? తాను పూర్తిచేసిన సినిమా విడుదలకు నోచుకుందా? వంటి ప్రశ్నలకు సమాధానమే “కళాపురం” చిత్రం.
నటీనటుల పనితీరు: మోస్తారుగా ఫేడవుట్ అయిపోయిన ఆర్టిస్టులు, చాలామంది కొత్త ఆర్టిస్టులు.. సినిమాలో దర్శకుడి పాత్ర పోషించిన సత్యం రాజేష్ లాగే.. దర్శకుడు కరుణ కుమార్ కూడా అలాగే కష్టపడ్డాడు. సన్నివేశానికి తగిన నటనతో కొందరు ఆకట్టుకుంటే.. అవసరానికంటే ఎక్కువ అతితో ఇంకొందరు చిరాకుపుట్టించారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు కరుణకుమార్ ఎంచుకున్న కథ.. మేకింగ్ విషయంలో “కంచెర్లపాలెం”ను, కథనం పరంగా “కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు, జిగర్తాండ” చిత్రాలను గుర్తుచేస్తుంది. కొన్ని కామెడీ సన్నివేశాలు, పంచ్ లు పర్వాలేదు అనేలా ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా చూస్తే కథకుడిగా-దర్శకుడిగా కరుణకుమార్ ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.
ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారనే విషయం టైటిల్స్ లో చూసి షాకై.. ఆ తర్వాత ఆయన మార్క్ నేపధ్య సంగీతం ఎక్కడైనా కనిపిస్తుందా అని ఆశగా చూడడం తప్ప పెద్దగా ఉపయోగమైతే ఉండదు. ప్రసాద్ జి.కె సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వంటి టెక్నికల్ అంశాలన్నీ ఆకట్టుకునే స్థాయిలో లేవు.
విశ్లేషణ: దర్శకుడు ఎంచుకున్న పాయింట్ మంచిదే కానీ.. ఆ పాయింట్ ను తెరకెక్కించిన విధానంలో ఎమోషన్ మిస్ అయ్యింది. అందువల్ల “కళాపురం” ఒక విఫల ప్రయత్నంగా మిగిలిపోయింది.