Kalki 2898 AD Review in Telugu: కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 28, 2024 / 06:09 PM IST

Cast & Crew

  • ప్రభాస్ (Hero)
  • దీపికా పదుకొనే, దిశా పటానీ (Heroine)
  • అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, శోభన, శాశ్వత చట్టర్జీ, బ్రహ్మానందం, పశుపతి తదితరులు.. (Cast)
  • నాగ్ అశ్విన్ (Director)
  • అశ్వనీ దత్ (Producer)
  • సంతోష్ నారాయణన్ (Music)
  • జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ (Cinematography)

“బాహుబలి” (Baahubali) తర్వాత ప్రభాస్ (Prabhas) రేంజ్ ఏ స్థాయిలో మారిపోయిందో తెలియజేసే చిత్రం “కల్కి” (Kalki 2898 AD) . నాగ్ అశ్విన్(Nag Ashwin)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యూచరిస్టిక్ డ్రామాలో అమితాబ్ బచ్చన్  (Amitabh Bachchan) , కమల్ హాసన్ (Kamal Haasan), దీపికా పడుకొనే  (Deepika Padukone) కీలకపాత్రలు పోషించారు. తొలుత ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలి అనుకున్నప్పటికీ.. సీజీ వర్క్ పెండింగ్ ఉండడంతో, జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి దాదాపు 600 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ ఇండియన్ మూవీ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: మహాభారత యుద్ధంలో తన కోపం కారణంగా కృష్ణుడి చేత శాపగ్రస్తుడైన అశ్వద్ధాముడు (అమితాబ్ బచ్చన్) వేల సంవత్సరాల పాటు మహావిష్ణు 10వ అవతారమైన “కల్కి” పుట్టుక కోసం వేచి చూస్తుంటాడు. కలియుగం అంతానికి దగ్గరలో భూమండలపు ఆఖరి నగరమైన కాశీ దగ్గర కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసి మానవజాతిని తుచ్ఛంగా చూస్తూ “మరో ప్రపంచం” కోసం పరితపిస్తుంటాడు సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్). ఎప్పటికైనా కాంప్లెక్స్ లోకి వెళ్లాలనే ధ్యేయంతో..

చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మిలియన్ యూనిట్స్ సంపాదించడం కోసం నానా పాట్లు పడుతుంటాడు భైరవ (ప్రభాస్). చిన్నప్పుడే తండ్రి కొన్ని యూనిట్స్ కోసం కాంప్లెక్స్ కు అమ్మేయబడిన అమ్మాయి సు-ఎంఐ8 అలియాస్ సుమతి (దీపిక పడుకొనే). ఈ నలుగురు కథ క్రమేణా ఎదురుపడాల్సి వస్తుంది. అసలు ఈ నలుగురికి లింక్ ఏమిటి? యాస్కిన్ ధ్యేయానికి అశ్వద్ధామ ఎలా ఎదురు నిలిచాడు? ఈ మహా యుద్ధానికి సుమతి ఎందుకు కారణమైంది? ఈ యుద్ధంలో భైరవ పాత్ర ఏమిటి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పిన సమాధానమే “కల్కి” చిత్రం!

నటీనటుల పనితీరు: అందరికంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది అమితాబ్ బచ్చన్ గురించి. 80 ఏళ్ల వయసులో ఆయన ఈ తరహా పాత్ర పోషించడం అనేది అభినందనీయం. సినిమా పట్ల ఆయనకి ఉన్న ప్యాషన్ కి ఇది నిదర్శనం. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ ను తప్ప ఎవర్నీ ఊహించుకోలేము. అలాగే.. డీఏజింగ్ తో అమితాబ్ ను యంగ్ గా చూపించిన విధానం బాగుంది. రెబల్ స్టార్ అభిమానులు ఎంతగానో మిస్ అవుతున్న ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ ను ఈ సినిమాలో పూర్తిస్థాయిలో పండించాడు. అలాగే.. ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా బాగున్నాయి.

అయితే.. కల్కి పార్ట్ 1లో ప్రభాస్ పాత్ర నిడివి తక్కువనే చెప్పాలి. అయితే.. సెకండాఫ్ లో ప్రభాస్ ను “కర్ణ”గా ఎలివేట్ చేసిన విధానం ఆడియన్స్ & ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. మరొక్క సీన్ పడి ఉంటే బాగుండేది అనుకొనేలోపు ప్రభాస్ గబుక్కున బుజ్జితోపాటు మాయమైపోతాడు. దీపిక పడుకొనే మంచి బరువైన పాత్రలో ఆకట్టుకుంది. ఆమె నటన, హావభావాలు పాత్రను చక్కగా ఎలివేట్ చేశాయి.

కమల్ హాసన్ దాదాపుగా గ్రీన్ మ్యాట్ షూట్ కే పరిమితమయ్యాడు. అందువల్ల ఆయన నటవిశ్వరూపం కోసం రెండో పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)  , శోభన (Shobana) , పశుపతి (Pasupathy), బ్రహ్మానందం (Brahmanandam) , అన్నా బెన్ తదితరులు తమ తమ పాత్రల్లో మెప్పించారు. అతిధి పాత్రల్లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రాంగోపాల్ వర్మ  (Ram Gopal Varma) , రాజమౌళి (Rajamouli), అనుదీప్ (Anudeep) , ఫారియా (Faria Abdullah) తదితరులు అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ కెమెరా వర్క్, సినిమాటోగ్రాఫర్ డిజోర్ద్జి స్టోజిల్కోవిచ్. కథా గమనంలో ఉన్న లొసుగుల్ని కవర్ చేస్తూ అత్యద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియన్స్ కు అందించడంలో విజయం సాధించాడు. సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) పాటల విషయంలో కాస్త నిరాశపరిచినా.. నేపధ్య సంగీతంతో మాత్రం అదరగొట్టాడు. ముఖ్యంగా వార్ ఎపిసోడ్స్ లో బీజీయమ్ భలే ఉంది. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ టీం పనితనాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఏ ఒక్క ఫ్రేములో కూడా వెలితి కనిపించలేదు. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ కలిగింది అంటే అందుకు కారణం ఈ రెండు డిపార్ట్మెంట్స్ అనే చెప్పాలి.

ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి చెప్పుకోవాలి. సూపర్ హీరోలు వేరే గ్రహాల నుండో, ప్రపంచాల నుండో రానక్కర్లేదు, మన భూమండలంలోనే, మన చరిత్రల్లోనే బోలెడు మంది సూపర్ హీరోలున్నారు అనే లాజిక్ తో “కల్కి” కథను అద్భుతంగా రాసుకున్నాడు. అశ్వద్ధామ కథను, కలియుగాంతానికి కనెక్ట్ చేసి రాసుకున్న కథ బాగుంది. అయితే.. కథనం విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఎంతో ఆసక్తికరమైన కథ ఉన్న “కల్కి” కథనం చాలా పేలవంగా సాగింది. అందువల్ల.. విజువల్స్ బాగున్నా, కథాపరంగా ప్రేక్షకులు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అయితే.. ప్రభాస్ ను కర్ణుడిగా ఎలివేట్ చేస్తూ రాసుకున్న & కంపోజ్ చేసిన ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోయాయి.

ఒక కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు నాగ్ అశ్విన్. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వదిలేశాడు. అయితే.. ఇంకా రెండు భాగాలు ఉన్నాయి కాబట్టి, అప్పటివరకూ ఆ టెన్షన్ ఉండాలి అనే పాయింట్ తో సినిమాను ముగించిన తీరు బాగున్నా.. 180 నిమిషాల సినిమాను కేవలం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ & ఎలివేషన్ కోసం వినియోగించడం ఒక్కటే పొసగలేదు.

విశ్లేషణ: తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచే సినిమా “కల్కి”. తదుపరి భాగాలు ఎప్పుడు విడుదలవుతాయనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు కాబట్టి.. “కల్కి” సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన ఈ మొదటి భాగాన్ని విజువల్స్ & నాగ్ అశ్విన్ విజన్ కోసం కచ్చితంగా చూడాల్సిందే.

ఫోకస్ పాయింట్: తెలుగు సినిమా ప్రపంచానికి అందించిన ఓ విజువల్ వండర్ “కల్కి”.

రేటింగ్: 3.5/5

Click Here to Read in ENGLISH

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus