Kamal Haasan: ప్రపంచానికి ‘భారతీయుడు’ అవసరం వచ్చింది.. కమల్ ఏం చెప్పారంటే?
July 9, 2024 / 06:42 PM IST
|Follow Us
‘భారతీయుడు’ సినిమా వచ్చినప్పుడు దేశంలో లంచాల పరిస్థితి ఎలా ఉందో? ఇప్పుడు ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా వచ్చినప్పుడు కూడా అలానే ఉంది. అందుకే ‘భారతీయుడు’ నాటి రోజుల్ని ఇప్పుడు మరోసారి తెర మీద చూస్తామని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఆ సంగతేంటో ఈ నెల 12న తేలుతుంది. ఆ రోజు సినిమా వస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ఇటీవల హైదరాబాద్లో మీడియాతో మాట్లాడింది. అందులో కమల్ హాసన్ (Kamal Haasan) కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
40 ఏళ్ల వయసున్నప్పుడు ‘భారతీయుడు’ సినిమా చేశాను. ఆ వయసులో అంత వయసు ఉన్న మనిషిగా నటించడానికి ఓకే చెప్పానంటే దర్శకుడి ఆలోచన, టీమ్ సహకారమే కారణం. ఆ సినిమాలో చెప్పిన అంశాలు నేటి సమాజాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు మేం చేసిన ‘భారతీయుడు 2’లో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే అంశాలు చాలానే ఉంటాయి. అలాగే సగటు కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన ఎలిమెంట్సూ ఉంటాయి. టెక్నాలజీ వచ్చాక ఎక్కువగా నేర్చుకున్నామేమో కానీ, నిజాయతీగా ఉండటాన్ని తగ్గించేస్తున్నాం.
ఏమన్నా అంటే తప్పంతా మీదే అంటూ రాజకీయ యంత్రాంగంపై నింద వేసేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మనల్ని పాలించే ఏ నాయకుడినైనా మనమే ఎన్నుకుంటాం. మనం అవకాశం ఇవ్వడం వల్లే ఆ వ్యక్తి అవినీతి చేస్తాడు. అందుకే దానికి బాధ్యత మనదే. అంతర్జాతీయంగానూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి అని కమల్ చెప్పాడు. ప్రపంచంలో చాలా దేశాల్లో అవినీతి భారీగా పెరిగిపోయింది, అందుకే ‘భారతీయుడు 2’ ప్రపంచానికే అవసరం.
ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్నది మనమే. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని సినిమాలు చేస్తే మంచి ఫలితాలొస్తాయి. కానీ మనం అలా చేయడం లేదు. ఒకవేళ అలా చేస్తే భవిష్యత్తులో ఆస్కార్ వాళ్లు వచ్చి పురస్కారాలు ఎలా పురస్కారాలు ఇవ్వాలో మన దగ్గర సలహాలు అడుగుతారు అని కమల్ అన్నారు. అలా అని ఈ మాట పొగరుతో అంటున్నది కాదు అని చెప్పారు కమల్.