Kamal Haasan: హిందీని చూసే నేర్చుకున్నామని గుర్తుంచుకోండి.. కమల్ కామెంట్స్!
June 1, 2022 / 01:02 PM IST
|Follow Us
సౌత్ సినిమా, నార్త్ సినిమాలకు సంబంధించిన వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సౌత్ లో రూపొందించిన సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్న తరుణంలో.. సౌత్ లో స్టార్ సినిమాలకు పాన్ ఇండియా సినిమాలు అంటూ ప్రత్యేక ట్యాగ్ లైన్లు ఏర్పడుతూ ఉండడంతో ఈ చర్చ, వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అంశంపై ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. దక్షిణాది స్టార్ల ఆధిపత్యాన్ని బాలీవుడ్ భరించలేకపోతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఈ విషయంపై లోకనాయకుడు కమల్ హాసన్ స్పందించారు. ఆయనకు మాట్లాడే అర్హత కూడా ఉంది. తన సొంత భాషలో సినీ కెరీర్ మొదలుపెట్టి.. వివిధ భాషల్లో నటించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కమల్ హాసన్ కు స్టార్ హీరో ఇమేజ్ ఉంది. హిందీలో కూడా కమల్ పలు సినిమాలు చేశారు. ఎన్నో ఏళ్ల క్రితమే అక్కడ సక్సెస్ అందుకున్నారు. ఆయనకున్న క్రేజ్ కారణంగా ఆయన నటించే సినిమాలన్నీ వివిధ భాషల్లోకి అనువాదమవుతున్నాయి.
ఇప్పుడు ఆయన నటించిన ‘విక్రమ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కమల్. ఈ సందర్భంగా ప్రస్తుతం పరిణామాలపై స్పందించారాయన. సౌత్ సినిమా, హిందీ సినిమా అంటూ వేరు చేసి చూడొద్దని, అన్ని సినిమాలను కలిపి ఇండియన్ సినిమాగా వ్యవహరించాలని అంటున్నారు కమల్.
సౌత్ లో ఇప్పుడు భారీ సినిమాలు వస్తున్నది నిజమేనని.. ఆ భారీ సినిమాల రూపకల్పనకు తాము హిందీ నుంచో చూసే నేర్చుకున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చారు. ఒక మొఘల్ ఏ అజామ్, మరో షోలే వంటి సినిమాలతో తామెంతో నేర్చుకున్నట్టుగా కమల్ చెప్పాడు. ఈ విషయంలో భాషా బేధాలు అనవసరమని అన్నారు.