Kamal Haasan: ఓటీటీ – థియేటర్ల గురించి కమల్ ఎప్పుడో చెప్పారుగా!
June 2, 2022 / 12:09 PM IST
|Follow Us
కమల్ హాసన్ ఆలోచనలు చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి అని చెబుతుంటారు సినిమా పరిశీలకులు. చాలా ఏళ్ల నుండి ఆయన్ను దగ్గరగా గమనిస్తున్నవాళ్లు ఈ విషయాలు చెబుతుంటారు. ఆయన సినిమాల్లో ఆ అడ్వాన్స్డ్ ఆలోచనలు కనిపిస్తుంటాయి. అంతే సినిమా రంగంలో వివిధ విభాగాల విషయంలోనూ ఆయన అడ్వాన్స్డ్గా కొన్ని ఆలోచనలు చేస్తుంటారు. వాటిని బయటకు చెబితే ఆశ్చర్యపోతుంటారు ట్రేడ్ వర్గాలు. అలా ఆయన గతంలో చెప్పిన ఓ విషయం ఇప్పుడు నిజమవుతోంది. కానీ ఆయన అప్పుడు ఆ మాట అన్నప్పుడు అందరూ తప్పుపట్టారు.
కమల్ హాసన్‌ను తప్పు పట్టింది దేని గురించో కాదు. ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారి సినిమా థియేటర్ల రంగానికి సవాలుగా మారిన ఓటీటీ గురించే. అవును చాలా ఏళ్ల క్రితమే ఓటీటీ గురించి, దాని ప్రభంజనం గురించి కమల్ హాసన్ సమాజంలో చర్చ జరగాలని, ఓటీటీ వచ్చి పెను మార్పులు తీసుకొస్తుందని చెప్పారు. అప్పట్లో మన దేశంలో ఓటీటీ అంటే అదో విదేశీ పదార్థం అనుకునేవారు. దీంతో కమల్‌ను అందరూ తప్పుపట్టారు. దానికి గురించి కమల్ ఇటీవల స్పందించారు.
ఓటీటీ విప్లవం వచ్చి తీరాలి, వచ్చింది కూడా అంటూ కాన్ఫిడెంట్‌గా తన పాట మాటను ఒత్తి చెబుతున్నారు కమల్. గతంలో ఇదే రావాలని నేను చెబితే అంతా నన్ను తప్పుపట్టారు. కొత్త విషయం అంటే మనకు ఎప్పుడూ ఓ భయం. అందుకే అలా అని ఉండొచ్చు. కానీ ఏదైనా విషయంలో వచ్చే మార్పులను మనం అడ్డుకోలేం. ఇప్పుడు ఓటీటీల విషయంలో అదే జరిగింది. అయినా మార్పు కోసం ఏం చేసినా థియేటర్‌కి వచ్చి సినిమాను చూడటాన్ని అందరం ఆస్వాదిస్తాం. అందుకే ఓటీటీ వచ్చినా థియేటర్లో మజా థియేటర్లోనిదే అన్నారు కమల్.
దానికి ఆయన ఓ లాజిక్ కూడా చెప్పారు. ‘‘ఇప్పుడు ఇంట్లో వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ఉంటుంది. దానర్థం తిరుపతిలో రద్దీ తగ్గుతుందని కాదు కదా. తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోవడం ఓ మరపురాని అనుభవం. అలా సినిమా అనుభవం అనేది ఓ భాష. పక్కనున్నవాడు ఏ జాతి, ఏ మతం అనేది చూడకుండా అందరితో కలసి కూర్చొని సినిమాని ఆస్వాదిస్తాం’’ అని కమల్ చెప్పారు. అంతేకాదు క్రీడల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది అని అన్నారు.