Kamal Haasan: పాన్ ఇండియాపై కమల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
June 2, 2022 / 11:15 AM IST
|Follow Us
పాన్ ఇండియా హీరో, పాన్ వరల్డ్ హీరో అంటూ ఈ మధ్య వింటూ ఉన్నాం. పాన్ ఇండియా సినిమాలతో సౌత్ సినిమాల సత్తా బాలీవుడ్‌ని షేక్ చేస్తోంది అంటూ గొప్పలు కూడా పోతున్నవాళ్లు కూడా ఉన్నారు. నిజానికి ఇదేమంత కొత్త విషయం కాదు, గతంలో చాలాసార్లు విన్నాం, చూశాం. గత కొన్నేళ్లలలో లేవంతే. ఈ మాట మనం అంత గట్టిగా చెప్పగలుగుతున్నాం అంటే దానికి కారణం మన ఉలగనాయగన్ అదేనండి లోకనాయకుడు కమల్ హాసన్ వల్లే.
ఆయన ఎప్పుడో ‘ఏక్ దుజే కేలియా’తో పాన్ ఇండియా హీరో అయ్యారు. మరి ఆయన నోట పాన్ ఇండియా ఏం చెప్పారో తెలుసా? పాన్ ఇండియా సినిమాల గురించి ఏం చెబుతారు కమల్ అని అడిగితే.. ‘‘చరిత్ర చూస్తే అక్కినేని ‘దేవదాస్’ తెలుగు వెర్షన్ చెన్నైలో మూడేళ్లు ప్రదర్శించారు. ‘మరోచరిత్ర’ తెలుగు చిత్రంగానే రెండున్నరేళ్లు షోలు వేశారు. ‘శంకరాభరణం’ సినిమా విషయంలోనూ ఇంతే.. ‘సాగరసంగమం’ డబ్ అయ్యి సిల్వర్‌జూబ్లీ ఆడింది.
‘స్వాతిముత్యం’ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నిజానికి పాన్ ఇండియా ట్రెండ్‌ని బాలచందర్ ఎప్పుడో పరిచయం చేసేశారు. ఆయనకంటే ముందు ఏఎన్నార్ లాంటివాళ్లు ఉన్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన సినిమా నిర్మాతలు, నిర్మాణం గురించి కూడా మాట్లాడారు. నాగిరెడ్డి తెలుగు సినిమాలొక్కటే చేయలేదు కదా, ‘మాయాబజార్’ సినిమాను తెలుగు, తమిళంలో తీశారు. ‘రాముడు భీముడు’ సినిమా అయితే తెలుగు, తమిళ, హిందీ… ఇలా భాషల్లో రూపొందించారు. చెప్పాలంటే మన ‘చంద్రలేఖ’ తొలి పాన్ ఇండియా సినిమా అవుతుంది.
ఈ సినిమా అప్పట్లో ఓ ‘బాహుబలి’ లాంటిది అని చెప్పారు కమల్ హాసన్. ఇక బాలీవుడ్ నిర్మాతల గురించి కమల్ ప్రస్తావిస్తూ… ముంబయి నిర్మాతలు వేరే భాషల్లో సినిమాలు చేయలేదు. అదే దక్షిణాది నిర్మాతలు చాలా భాషల్లో సినిమాలు చేశారు. బెంగాలీలోనూ మన వాళ్లు సినిమాలు తీశారు. డి.రామానాయుడు దాదాపుగా అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించారు. ఆ లెక్కన ఈ ట్రెండ్ అంత కొత్తదేమీ కాదు అని కమల్ చెప్పారు.