Kamal Haasan: ఉదయనిధి స్టాలిన్ తో కమల్ సినిమా.. పాలిటిక్స్ పక్కన పెట్టినట్లేనా..?
July 30, 2022 / 11:21 AM IST
|Follow Us
జయలలిత మరణం తరువాత తమిళనాట నెలకొన్న రాజకీయ శూన్యతను ఉపయోగించుకొని.. రాజకీయాల్లో రాణించాలని ఎన్నో ఆశలతో పొలిటికల్ పార్టీను మొదలుపెట్టారు కమల్ హాసన్. ఆయనతో పాటు రజినీకాంత్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేసినా.. స్టార్టింగ్ లోనే డ్రాప్ అయిపోయారు. కానీ కమల్ మాత్రం చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేశారు. జనాల్లో తిరుగుతూ తన పార్టీకి ప్రచారం కల్పించారు. కొత్త తరహా రాజకీయం చేస్తానని.. మార్పు తీసుకొస్తానని ప్రకటనలు చేశారు.
కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా కమల్ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. గతేడాది అసెంబ్లీయే ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన తరువాత ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. అయితే రాజకీయాలకు దూరమవుతున్నట్లు కానీ.. పార్టీని మూసేస్తున్నట్లు కానీ కమల్ ఆ సమయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. కొంత గ్యాప్ ఇచ్చిన పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు.
పార్టీని నడిపించాలంటే అధికారంలో ఉన్నవారితో పోరాటం చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కమల్ కి ఆ ఓపిక లేనట్లే ఉంది. అందుకే రాజకీయ కార్యకలాపాలన్నీ ఆపేసి సినిమాల మీద దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న స్టాలిన్ ని వెళ్లి కలిసి అభినందించడం.. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో సన్నిహితంగా ఉండడం.. అతడితో కలిసి ‘విక్రమ్’ సినిమాను నిర్మించడం..
ఇవన్నీ చూస్తుంటే కమల్ ఆలోచనలేంటో అర్ధమవుతోంది. ఇప్పుడు ఉదయనిధిని హీరోగా పెట్టి తనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు కమల్ హాసన్. ఈ సినిమా ప్రకటన చూసిన తరువాత కమల్ పూర్తిగా రాజకీయాల మీద ఆశలు వదులుకున్నట్లే అని అంటున్నారు.