Kangana Ranaut: పెద్ద నిర్మాణ సంస్థను టార్గెట్ చేసిన ‘తలైవి’!
September 6, 2021 / 03:17 PM IST
|Follow Us
ఇండస్ట్రీలో ఏ విషయం మీద అయినా… స్పందించే వ్యక్తుల్లో కంగన రనౌత్ ఒకరు. సినిమాలు, సినిమా తారల జీవితాలు, రాజకీయాలు, సమాజంలోని విషయాలు… ఇలా ఒకటి కాదు, రెండు కాదు అన్ని రకాల విషయాల మీద స్పందిస్తూ ఉంటుంది. అందులో సినిమాల గురించి కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. తాజాగా ఆమె థియేటర్లు, నిర్మాతల గురించి మాట్లాడింది. అలా అనేకంటే… తనదైన శైలిలో విరుచుకుపడింది అనే చెప్పాలి. కంగన రనౌత్ నటించిన తాజా చిత్రం ‘తలైవి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 10న సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో కంగన సినిమా విడుదల గురించి మాట్లాడింది. కొంతమంది థియేటర్ల యజయానులు, ఫిలిం స్టూడియోల గ్యాంగిజం, గ్రూపిజం కారణంగా సినిమా వ్యాపారానికి తీవ్ర నష్టం జరుగుతోందని కంగన ఆవేదన వ్యక్తం చేసింది. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమల్లో సినిమా ఇండస్ట్రీ ఒకటి. థియేటర్ వ్యాపారం బాగా క్షీణించిపోయింది. ఓటీటీ వేదికలు మంచి లాభాలు గడించాయి.
నాయకానాయికలగా మాకూ భారీ ఆఫర్లు వచ్చాయి. థియేటర్ల ద్వారానే మేం ఈ స్థాయికి వచ్చాం. వాటికి అండగా ఉండాలని… మా సినిమాను థియేటర్లలో విడుదలకు ముందుకొచ్చాం. అయితే థియేటర్ల నుండి మాకు సరైన మద్దతు దక్కలేదు. కొంతమంది మా సినిమా ప్రదర్శించడానికి ముందుకు రావడం లేదు. యశ్రాజ్ లాంటి ఫిల్మ్ స్టూడియోలు మా సినిమాను ప్రదర్శించడానికి ఒప్పుకోవడం లేదు అంటూ కంగన విమర్శించింది. నాకు, మా సినిమాకు ప్రేక్షకుల మద్దతు చాలా అవసరం. మల్టీప్లెక్సుల్లో మా చిత్రాన్ని ప్రదర్శించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనే చూడండి అంటూ కంగన పిలుపునిచ్చింది. ఆ తర్వాత కావాలంటే ఓటీటీల్లో చూడండి అని కోరింది కంగన.