కన్నడ స్టార్ హీరో దర్శన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొత్త సినిమా ‘రాబర్ట్’ను తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు ఈ హీరో. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తెలుగులో ఓ పోస్టర్ కూడా వదిలారు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ విషయంలో టాలీవుడ్ తనకు సహకరించడం లేదని ఈ హీరో మండిపడుతున్నాడు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సహకరించడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నాడు. నిజానికి మార్చి 11న తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
శర్వానంద్ ‘శ్రీకారం’, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’, ‘గాలి సంపత్’, ‘జాతిరత్నాలు’ ఇలా మొత్తం నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలకే థియేటర్లు అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంటే.. తెలుగులో ఎలాంటి గుర్తింపు, మార్కెట్ లేని దర్శన్ సినిమా కోసం ఇప్పుడు థియేటర్లు ఎక్కడ నుండి తీసుకొస్తారు..? ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. తన సినిమాను తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయడానికి సహకరించడం లేదంటూ దర్శన్ కన్నడ ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించాడు.
కర్ణాటకలో తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాలు కూడా పెద్ద ఎత్తున విడుదలవుతుంటాయని.. వాటి వలన కన్నడ సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని.. మన సినిమాలను వేరే భాషల్లో రిలీజ్ కి సహకరించనప్పుడు.. ఇతర భాషా చిత్రాలను కన్నడలో ఎందుకు రిలీజ్ చేయాలంటూ ప్రశ్నించాడు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి!