దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల తర్వాత ముఖ్యంగా కర్ణాటకలో జక్కన్నని అభిమానించేవారు ఎక్కువ. ఆ అభిమానంతోనే రాజమౌళికి పద్మశ్రీ అవార్డును అక్కడి ప్రభుత్వం సిఫార్సు చేసింది. అంతేకాదు రాజమౌళి కుటుంబానికి కర్ణాటకతో అనుబంధం ఉంది. కొంతకాలం కర్ణాటక బార్డర్ లో నివసించారు కూడా. ఆ చనువుతోనే రాజమౌళిని బెంగళూరులో జరుగుతోన్న ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆహ్వానించారు. కర్ణాటక చలన చిత్ర అకాడమీ ఆహ్వానాన్ని రాజమౌళి తిరస్కరించారు. అంతేకాదు రాలేనని నేరుగానే చెప్పాసేశారని సమాచారం. దీంతో రాజమౌళిపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళికి ప్రత్యేక ఆహ్వానం పంపినా రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇది కన్నడ ప్రజలను, ముఖ్యమంత్రిని అవమానించటమేనని అంటున్నారు. రాజమౌళి సమయం ఎంతో అమూల్యమైందే.. అయితే మాకోసం కొంత సమయం కేటాయిస్తే బాగుండేదని కర్ణాటక చలన చిత్ర అకాడమీ ఛైర్మన్ ఎస్వీ రాజేంద్రసింగ్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను రాయ్‌చూర్ మూలాలు ఉన్నవాడినంటూ బాహుబలి విడుదల సమయంలో (సత్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు) రాజమౌళి మాట్లాడిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో నెటిజనులు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. ముందుగా ఇతరులకు ఇచ్చిన మాట ప్రకారం.. ఆ కార్యక్రమాలతోనే తాను ఫెస్టివెల్ కి వెళ్లలేకపోతున్నట్లు వెల్లడించారు.