‘పెంగ్విన్’ నాలుగు రోజుల్లో జరిగే కథ : కీర్తి సురేష్
June 18, 2020 / 07:00 PM IST
|Follow Us
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పెంగ్విన్’ జూన్ 19న(రేపు) విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చెయ్యాలి అనుకున్నారు… కానీ అమెజాన్ లో విడుదల చేస్తున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే కీర్తి సురేష్… ఇప్పుడు తన కొత్త సినిమా మాత్రం ఓటిటిలో విడుదలవుతుండడం.. అంటే ఆమె ఇమేజ్ దెబ్బతింటుందేమో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయం పై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది.ఆమె మాట్లాడుతూ…” ‘పెంగ్విన్’ థియేటర్లలోనే విడుదలవుతుందనుకున్నాను.
ఓ సినిమాని థియేటర్లో చూస్తున్నప్పుడు ఫీలింగ్ ఒకలా ఉంటుంది.. ఇంట్లో చూస్తున్నప్పుడు ఫీలింగ్ మరోలా ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా బాలేదు.ఇలాంటి పరిస్థితుల్లో నా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఓటీటీలో నా సినిమా విడుదలవుతోందనేది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తున్నా…దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం పాపులర్ అవుతుంది నా సినిమా. థియేటర్ల ద్వారా అయితే ఎంత మంది చూస్తారో తెలీదు… కానీ ఓటీటీ ద్వారా అయితే ఎక్కువ మంది చూస్తారు. ‘మహానటి’ తర్వాత నేను ఒప్పుకొన్న కథ కూడా ఇదే.
మధ్యలో కొన్ని సినిమాలు విడుదలైనా.. వాటికంటే ముందే ‘పెంగ్విన్’ కథ ఓకే చేశాను. అన్ని రకాల సినిమాలు నేను చెయ్యాలి అనుకుంటున్నాను. నేను నటించిన మొదటి థ్రిల్లర్ సినిమా ఇది. నిజానికి దీనిని ఎమోషనల్ థ్రిల్లర్ అనడమే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇందులో చాలా ఎమోషన్స్ ఉంటాయి. థ్రిల్ అనేది కథలో ఒక లేయర్ లాంటిది. తల్లీ బిడ్డల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో సినిమా ఉంటుంది. ‘పెంగ్విన్’ చిత్రం నాలుగు రోజుల్లో జరిగే కథగా సాగుతుంది” అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.