‘మహానటి’ సావిత్రి జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆమె గురించి నిన్నటితరానికి తెలియని విషయం లేదు. అందుకే సావిత్రి ఎలా మరణించింది అనే విషయం కంటే ఎలా బ్రతికింది అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “మహానటి”. మే 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ “మహానటి సావిత్రి”గా టైటిల్ పాత్ర పోషించింది. మరో మూడు రోజుల్లో సినిమా విడుదలవుతుండగా.. “మహానటి”గా “మహానటి”లో నటించడం పట్ల తన అనుభవాలు, అనుభూతులు మీడియాతో పంచుకొంది.
ఏడాదిన్నర ప్రయాణమిది.. ఇప్పటివరకూ నేను ఒక సినిమా కోసం మహా అయితే మూడు లేదా నాలుగు నెలలు వెచ్చించాను. కానీ.. “మహానటి” కోసం దాదాపు 10 నెలలు కేవలం షూటింగ్ కోసమే స్పెండ్ చేశాను. ప్రీప్రొడక్షన్ కోసం రెండు నెలలు, డబ్బింగ్ కోసం ఒక నెల. ఇక ఈమధ్యలో గ్యాప్స్ అన్నీ కలిపిస్తే దాదాపు ఏడాదిన్నరపాటు “మహానటి” సినిమాలో “మహానటి”గా ట్రావెల్ చేశాను. అందుకే “మహానటి” నా మనసుకి దగ్గరైన సినిమా.
అశ్విన్ నువ్వే “మహానటి” అనగానే షాక్ అయ్యాను.. నేను యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టినప్పట్నుంచి ఇప్పటివరకు ఎవరూ కనీసం ఒక్కసారి కూడా “నువ్ సావిత్రిలా ఉంటావ్” అనగా నేను వినలేదు. అలాంటిది నాగఅశ్విన్ వచ్చి “మీరు సావిత్రి గారిలా యాక్ట్ చేయాలి, మీరే ఆ పాత్రకు బాగుంటారు” అని చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ముందు అసలు సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత అశ్విన్ ఫుల్ నేరేషన్ ఇచ్చాక వెంటనే నా రూమ్ లో ఉన్న అద్దంలో “అసలు నేను సావిత్రిలా ఏ యాంగిల్ లో కనిపించాను అని నా ముఖం నేను చూసుకున్నాను”.
దాదాపు 100 లుక్స్ ట్రై చేశాం.. బేసిగ్గా నేను చాలా ట్రెడిషనల్ గా ఉంటాను. నాకు చీరలు కట్టుకోవడం కొత్త కాదు, అందువల్ల “మహానటి”లో ఎక్కువగా శారీస్ కట్టుకోవాలి అని తెలిసినప్పుడు సంతోషపడ్డాను. సినిమాలో నేను సావిత్రి గారిలా కనిపించడం కోసం చాలా లుక్ టెస్ట్స్ చేశాం. అందువల్ల అసలు ఏ లుక్ బయటకి వస్తుంది అనే విషయంలో నాకే క్లారిటీ లేకుండాపోయింది. ముఖ్యంగా షూటింగ్ లో రోజుకి 4, 5 డ్రెస్ ఛేంజస్ ఉండేవి.
గమనాన్ని గతి తప్పించలేదు.. సావిత్రి గారి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమానే అయినప్పటికీ.. కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశాం. అంతే తప్ప ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు లేదా ఎమోషన్స్ ను ఇరికించలేదు. అంత అవసరం కూడా రాలేదు, ఎందుకంటే సావిత్రి గారి జీవితమే ఒక పెద్ద ఎమోషన్, అందులో మళ్ళీ ఎక్స్ట్రా ఎమోషన్స్ యాడ్ చేయాలన్న థాట్ కూడా ఎవరికీ రాదు.
నిడివి తక్కువ, సన్నివేశాలు ఎక్కువ.. సినిమాలో సావిత్రిగారి జీవితంలో ముఖ్యమైన సంఘటలను, కొన్ని సినిమాల్లోని కీలకమైన సన్నివేశాలను సినిమాలో చిత్రీకరించాలి. అలాగని ఒకే సన్నివేశాన్ని ఎక్కువ లెంగ్త్ తో రీక్రియేట్ చేసినా బోర్ కొట్టేస్తుంది, రన్ టైమ్ సరిపోదు. అందుకే తక్కువ రైన్ టైమ్ లో ఎక్కువ సన్నివేశాలను చిత్రీయకరించాం. ఆ సన్నివేశాలన్నీ చూడ్డానికి ఎంత బాగుంటాయో ఇప్పుడు నేను చెప్పేకంటే సినిమా మీరు చూసి అనుభూతి చెందితే బాగుంటుంది.
ఆవిడలా కనిపించడం కంటే నటించడం కష్టం.. ఈ సినిమా సైన్ చేశాక నాకు ఎదురైన పెద్ద చాలెంజస్ రెండు. 1) నేను అసలు సావిత్రిలా స్క్రీన్ మీద కనిపించగలుగుతానా? 2)ఆవిడ స్థాయిలో ఆవిడ పాత్రకు న్యాయం చేయగలుగుతానా?. ఫోటోషూట్ అండ్ రెండు రోజుల షూటింగ్ అనంతరం లుక్ గురించి టెన్షన్ తగ్గిపోయింది. ఆ తర్వాత మహానటిగా ఆమె స్థాయిలో నటించానా లేదా అనేది మాత్రం బుధవారం ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు.
సావిత్రిగారితో నాకు చాలా కంపేరిజన్స్ ఉన్నాయి.. సినిమాకి సైన్ చేసిన తర్వాత సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వరిగారితో మాట్లాడడం జరిగింది. ఆమె సావిత్రి గారి గురించి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ నాకు పంపించారు. వాటిలో చాలా విషయాలు నా పర్సనల్ క్యారెక్టర్ కు మ్యాచ్ అయ్యాయి. ఉదాహరణకు నాకు స్విమ్మింగ్, క్రికెట్ అంటే పిచ్చి. సావిత్రిగారికి కూడా అవంటే విపరీతమైన ఇష్టమట. ఒక్కోసారి అనిపిస్తుంది ఇన్ని కుదిరాయి కాబట్టే ఆమె పాత్ర నేను పోషిస్తున్నానేమో అనిపిస్తుంది.
ఆవిడ గురించి ఎవరికీ తెలియని విషయాలేమిటంటే.. సావిత్రి గారు చాలా సిన్సియర్ నటీమణి, రేస్ కార్స్ అంటే ఇష్టం వంటి విషయాలు మాత్రమే అందరికీ తెలుసు. కానీ.. సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు తెలిసినదేమిటంటే.. సాయివిత్రిగారికి చాలా జోవియల్ అండ్ హ్యూమరస్ పర్సన్. అలాగే.. తన పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా.. తన, పరాయి అన్న బేధం చూపకుండా అడిగినవారికి తప్పకుండా తనకు కుదిరినంతలో సహాయం చేసేదట. ఇలాంటి విషయాలు తెలిసాక ఆమె మీద అభిమానం రెట్టింపయ్యింది.
ఈ అమ్మాయి ఏం సూట్ అయ్యింది అన్నారు కూడా.. ప్రతి విషయానికి పాజిటివ్ ఉన్నట్లే. నెగిటివ్ కూడా ఉంటుంది. “మహానటి” సినిమాలో నేను సావిత్రిగా నటిస్తుండడం పట్ల ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేసినవాళ్లు ఉన్నట్లే.. “ఈ అమ్మాయి సావిత్రిగా యాక్ట్ చేయడమేంటి?” అంటూ వ్యంగ్యంగా స్పందించినవారు కూడా ఉన్నారు. అయితే.. నేను నెగిటివ్ కామెంట్స్ ను ఎక్కవగా పట్టించుకోలేదు. ఎందుకంటే వాటిని నేను మైండ్ లోకి తీసుకుంటే నాకున్న కాన్ఫిడెన్స్ పోతుంది.
మా అమ్మ నవ్వితే చాలు.. మా అమ్మ సావిత్రిగారికి పెద్ద అభిమాని. చిన్నప్పట్నుంచి ఆమె గురించి చెప్పడం, నన్ను కూర్చోబెట్టి మరీ సావిత్రి గారి సినిమాలు చూపించడం అనేది చేస్తూండేది. నేను “మహానటి”గా నటిస్తున్నాని చెప్పినప్పుడు అందరికంటే ఎక్కువగా సంతోషపడింది మా అమ్మే. అలాగే “సావిత్రి”లా కనిపించడానికి నాకంటే మా అమ్మే ఎక్కువ జాగ్రత్తలు తీసుకొంది. సినిమా చూసిన తర్వాత మా అమ్మ సంతోషంగా నవ్వితే అదే నాకు లభించే బిగ్గెస్ట్ గిఫ్ట్ అండ్ కాంప్లిమెంట్.
ఇకపై కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకొంటాను.. ఇప్పటివరకూ నేను ఎలాంటి సినిమాలు చేసినా, ఎలాంటి పాత్రలు పోషించినా పట్టించుకొనేవారు కాదు. కానీ.. “మహానటి”గా టైటిల్ పాత్ర పోషిస్తున్నాను కాబట్టి నా మీద బాధ్యత మరింతగా పెరిగింది. అందుకే ఇకపై నటించే సినిమాల్లో నా పాత్ర కేవలం పాటలకి పరిమితం కాకుండా కథలో భాగమైయ్యేలా, ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటాను.
మహానటిగా నేనే ఫస్ట్ ఛాయిస్.. “మహానటి” ఎనౌన్స్ మెంట్ అయ్యాక టైటిల్ పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ.. డైరెక్టర్ నాగఅశ్విన్ కి మాత్రం నేనే ఫస్ట్ ఛాయిస్. అందుకే ఎంతమంది ఆప్షన్స్ వచ్చినా నన్నే ప్రిఫర్ చేశాడు. నేను నటించిన “రైల్” సినిమాలో నా ఇన్నోసెన్స్ నచ్చి నన్ను ఈ సినిమా కోసం తీసుకొన్నాడట.
తెలుగు ఎంత కష్టమో అప్పుడు తెలిసింది.. నేను ఇన్నాళ్ళు నాకు వచ్చిందే అసలైన తెలుగు అనుకున్నాను. కానీ.. తెలుగులో, ముఖ్యంగా స్పష్టమైన తెలుగులో మాట్లాడడం ఎంత కష్టం అనే విషయం “మహానటి” చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నప్పుడు తెలిసింది. చాలామంది సహాయం తీసుకొని ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పాను.
మోహన్ బాబు గారు ఆశ్చర్యపోయారు.. నా చిన్నప్పుడు ఒకసారి మోహన్ బాబు గారి దగ్గర “ఆటోగ్రాఫ్” తీసుకొన్నాను. అది దాదాపు పన్నెండేళ్ళ పూర్వం జరిగిన విషయం. అలాంటిది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది. షూటింగ్ మొదలయ్యాక ఆయన దగ్గరకి ఆ “ఆటోగ్రాఫ్”ను తీసుకొచ్చి చూపించాను. ఆయన కూడా షాక్ అయ్యారు. ఇది ఎప్పటిది అని అడిగారు.
ఆనందం, భయం కలగలిసిన ఎమోషన్.. సినిమా కోసం చాలా కష్టపడ్డాం, షూట్ చేశాం, డబ్బింగ్ అయిపోయింది. సినిమా రిలీజ్ కి సరిగ్గా మూడు రోజులుంది. “మహానటి” విడుదలయ్యాక సినిమా హిట్ అవుతుందా లేదా అనే విషయం కంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారు అనే విషయం గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం అయితే ఉంది.
– Dheeraj Babu