బాలీవుడ్ అంటే ఖాన్స్.. ఖాన్స్ అంటే బాలీవుడ్ అని అనుకునేవారు గత కొన్నేళ్ల క్రితం వరకు. అలా అని బాలీవుడ్లో ఖాన్స్ తప్ప వేరెవరూ సినిమాలు చేయరని కాదు. భారీ హిట్లు కొట్టాలన్నా, వందల కోట్ల కలెక్షన్లు రావాలన్నా వాళ్లకు మాత్రమే సాధ్యం అనుకునేవారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ రూపంలో ఖాన్ త్రయం బాలీవుడ్‌కి రికార్డు వసూళ్లూ అందిస్తూ ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా ఖాన్ త్రయం ప్రభ మసకబారుతోంది. ఇన్నాళ్లూ దీన్ని పట్టించుకోని బాలీవుడ్ జనాలు ఇప్పుడు ‘ఖాన్స్ రీఎంట్రీ బలంగా ఇవ్వాల్సిందే’ అని అంటున్నారు. ఇంతకీ కారణమేంటంటే…
బాలీవుడ్లో ఖాన్స్ సత్తా… ఇప్పటిది కాదు. 90వ దశకంలోనే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించేవారు. పోటాపోటీగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ను బిజీగా ఉంచేవారు. ఒకానొక సమయంలో బాలీవుడ్ అంటేనే ఆ ముగ్గురు ఖాన్‌లేనా అనే ప్రశ్న కూడా ఉదయించింది. వాళ్ల జోరును తట్టుకోలేని కొంతమంది అయితే ఆ ముగ్గురు వల్ల యువ హీరోలకు స్థానం లేకుండా పోతోంది. మిగిలిన స్టార్ హీరోల పరిస్థితీ దాదాపు అంతే అన్నారు కూడా.
అయితే ప్రస్తుతం మళ్లీ ఆ ఖాన్స్ సత్తా చాటి… బాలీవుడ్‌ను తిరిగి ట్రాక్ ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది. కారణం పాన్ ఇండియా సినిమాల ధాటికి బాలీవుడ్ సినిమాలు నిలవలేకపోతుండటమే. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ సినిమాలకు సరైన వసూళ్లు రావడం లేదు. ఓ మోస్తరు టాక్ అందుకున్న సినిమా సైతం భారీ వసూళ్లు సాధించేవి. ఇప్పుడు హిట్ టాక్ అందుకున్నా పాన్ ఇండియా సినిమాల స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. దీంతో బాలీవుడ్ వెనకబడింది అనే సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి.
గత కొన్నేళ్లలో బాలీవుడ్ ఖాన్స్ పరిస్థితులు మారాయి. షారుఖ్ ఖాన్ బాగా డౌన్ అయిపోయాడు. సల్మాన్ కెరీర్ ఒడుదొడుకులతో సాగుతోంది. ఆమిర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఇప్పుడు వరుస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘పఠాన్’తో షారుఖ్ ఖాన్… ‘కబీ ఈద్ కబీ దివాళీ’, ‘టైగర్ 3’తో సల్మాన్ ఖాన్ త్వరలో వస్తారు. ఆగస్టు 11న ‘లాల్ సింగ్ చద్దా’గా ఆమిర్ ఖాన్ వస్తాడు. ఈ ముగ్గురు బాగా రాణించి బాలీవుడ్‌కి నాటి రోజులు ఇవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.