Ramesh Varma: ‘ఖిలాడీ’ గురించి ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు!
February 9, 2022 / 12:29 PM IST
|Follow Us
మీరు చూసింది, విన్నది నిజమే… దేవిశ్రీప్రసాద్ అరగంటలో ఆరు పాటలు ఇచ్చేశాడు. ఈ మాట ఎవరో చెబితే తెలుసుకున్నది దర్శకుడు రమేశ్ వర్మ చెప్పిందే. సినిమా గురించి మాట్లాడుతూ సంగీత దర్శకుడు ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాడు. సినిమా కథ వినగానే ఇన్స్పైర్ అయ్యి… 30 నిమిషాల్లో ఆరు పాటలు ఇచ్చాడట దేవిశ్రీప్రసాద్. అయితే సినిమాలో ఐదు పాటలే అవసరముంది ఒక పాటను పక్కన పెట్టారట. ఫిబ్రవరి 11న ‘ఖిలాడీ’ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇంటర్వ్యూలు ఇస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు రమేశ్ వర్మ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనే దేవిశ్రీప్రసాద్ గురించి, ఆయన అందించిన పాటల గురించి చర్చ వచ్చింది. మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా జరిగాయి అనేది ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దర్శకుడు రమేశ్ వర్మ. పాటల కోసం ఇద్దరం కలసి కూర్చుకున్నామని… అలా అలా మాట్లాడుకుంటూ రాత్రి 2 అయ్యిందని చెప్పాడు. ఆ సమయంలోనే సినిమా కథ చెప్పారట. రెండు గంటలకు కథ చెప్పడం ప్రారంభించి 4.30 వరకు కథ పూర్తి చేశారట. ఆ తర్వాత అరగంటలోనే మొత్తం ఆరు పాటలు ఇచ్చారని చెప్పారు రమేశ్ వర్మ.
సినిమా కథ విని, ఇన్స్పైర్ అయ్యి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పాటలు ఇచ్చారని, అంత వేగంగా తమ మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి అయిపోయాయని దర్శకుడు తెలిపాడు. ఆ పాటలు ఇప్పుడు అందరూ వింటున్నారని, ఒక్కోటి ఛార్ట్‌బస్టర్ అయ్యాయని చెప్పారు దర్శకుడు. అయితే సినిమాకు ఐదు పాటలే అవసరం అయ్యాయని, అందుకే ఒక పాట వదిలేశామని చెప్పాడు. దీంతోపాటు మరో రెండు ఫైట్స్ కూడా పక్కన పెట్టామని చెప్పారు. దీంతోపాటు అరగంటలో ఆరు ట్యూన్స్ మాట వైరల్‌గా మారిపోయింది.
సోషల్ మీడియాలో ఆ వీడియో బిట్ తెగ తిరుగుతోంది. అరగంటలో ఆరా? ఇదెలా సాధ్యం అని కొందరు. వేరే దర్శకుల దగ్గర రిజక్ట్ అయిన పాటలా అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే అరగంటలో ఆరు పాటల విషయం దేవిశ్రీప్రసాద్‌ని అడిగి కన్ఫామ్ చేసుకోవచ్చు అని కూడా రమేశ్ వర్మ అంటున్నారు.