Konaseema Thugs Review in Telugu: కోనసీమ తగ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
March 31, 2023 / 04:53 PM IST
|Follow Us
Cast & Crew
హృదు హరూన్ (Hero)
అనశ్వర రాజన్ (Heroine)
బాబీ సింహా, ఆర్కే సురేష్ తదితరులు.. (Cast)
బృంద (Director)
రియా శిబు - ముంతాస్.ఎం (Producer)
శామ్ సి.ఎస్ (Music)
ప్రియేష్ గురుస్వామి (Cinematography)
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డ్యాన్స్ మాస్టర్ అయిన బృంద దర్శకురాలిగా మారి తెరకెక్కించిన రెండో సినిమా “తగ్స్”. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో “కోనసీమ తగ్స్” అనే పేరుతో అనువదించి.. రెండు భాషల్లో ఒకేరోజు విడుదల చేశారు. హీరోహీరోయిన్లు కొత్తవాళ్లు అయినప్పటికీ.. క్యారెక్టర్స్ అందరూ సీజన్ద్ ఆర్టిస్టులు కావడం, ట్రైలర్ కట్స్ & కెమెరా వర్క్ బాగుండడంతో సినిమాపై మాస్ సర్కిల్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!
కథ: కాకినాడలో హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ తిరిగే కుర్రాడు శేషు (హృదు హరూన్). తొలిచూపులోనే కోయిల (అనశ్వర రాజన్)ను ప్రేమిస్తాడు. ఆమెతో జీవితం ఊహించుకుంటూ ఎంతో ఆనందంగా బ్రతికేస్తుంటాడు. కట్ చేస్తే.. తను పనిచేసే లోకల్ రౌడీ తమ్ముడు తన ప్రేయసి మీద మోజుపడడం తట్టుకోలేక, ఒకానొక సందర్భంలో అనుకోకుండా అతడి మృతికి కారణమవుతాడు.
దాంతో కాకినాడ జైల్లో పడతాడు. అక్కడ పరిచయమవుతారు దొర (బాబీ సింహా), మధు (మునిష్కాంత్) తదితరులు. వాళ్లందరితో కలిసి జైల్ నుంచి తప్పించుకోవాలని డిసైడ్ అవుతాడు. అసలు శేషు ప్లాన్ ఏంటి? జైల్ నుంచి ఎలా తప్పించుకోవాలనుకుంటాడు? తప్పించుకున్న తర్వాత లైఫ్ లీడ్ చేయడానికి శేషు ప్లానింగ్ ఏమిటి? అనేది “కోనసీమ తగ్స్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
నటీనటుల పనితీరు: హీరో హృదు హరూన్ చూడ్డానికి చిన్నపిల్లాడిలా ఉన్నా.. నటుడిగా మాత్రం అలరించాడు. రఫ్ క్యారెక్టర్లో మంచి ఈజ్ తో నటించాడు. ఈ సినిమా ఆ కుర్రాడి తొలి చిత్రమనుకొలేం. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ లో చక్కని పరిణితి ప్రదర్శించాడు. బాబీ సింహా, మునిష్కాంత్, ఆర్కే సురేష్ వంటి హేమాహేమీల నడుమ తన స్క్రీన్ ప్రెజన్స్ ను కాపాడుకోగలిగాడంటే.. నటుడిగా మంచి ఫ్యూచర్ గ్యారెంటీ.
హీరోయిన్ అనశ్వరకు ఉన్న స్క్రీన్ టైమ్ తక్కువ అయినప్పటికీ.. ఉన్నపాటి కొద్ది సన్నివేశాల్లో అందంగా, కళ్ళతో హావభావాలు పలికిస్తూ ఆకట్టుకుంది. బాబీ సింహా, మునిష్కాంత్, ఆర్కే సురేష్ పోటీపడి నటించారు. సినిమా రక్తి కట్టింది అంటే ఈ ముగ్గురి నటన వల్లే. బాబీ సింహా క్యారెక్టర్ కు ఇచ్చిన ఎలివేషన్ బాగుంది. అలాగే.. ఆర్కే సురేష్ పాత్రకు కూడా కాస్త బ్యాగ్రౌండ్ యాడ్ చేసి ఉంటే ఇంకాస్త కనెక్టివిటీ ఉండేది. అలాగే మునిష్కాంత్ పాత్రను ఎలివేట్ చేసిన విధానం కూడా బాగుంది.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ ప్రియేష్ గురుస్వామి ఈ సినిమాకి రియల్ హీరో. గంటన్నరకు పైగా సినిమా ఒకే లొకేషన్ లో జరిగినా.. ఎక్కడా బోర్ కొట్టకుండా చిన్న లొకేషన్ ను కూడా మల్టీపుల్ యాంగిల్స్ లో కవర్ చేసిన విధానం బాగుంది. అలాగే డిమ్ లైట్ షాట్స్ & నైట్ షాట్స్, ముఖ్యంగా క్లైమాక్స్ బ్లాక్ ను పిక్చరైజ్ చేసిన విధానం ఆడియన్స్ కు, ముఖ్యంగా మాస్ జనాలకి మంచి కిక్ ఇస్తుంది. సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారకుడు ప్రియేష్ అని చెప్పాలి.
శిబు తమీన్స్ కథను “ప్రిజన్ బ్రేక్, శవ్శాంక్ రిడంప్షన్” వంటి సినిమాల స్పూర్తితో రాసుకున్నప్పటికీ.. నేటివిటీకి తగ్గట్లుగా కథ & స్క్రీన్ ప్లే ను రాసుకోవడంలో విజయం సాధించాడు. ప్రతి పాత్రకు ఒక మోటివ్ ఉండేలా ప్లాన్ చేసిన విధానం బాగుంది. శామ్ సి.ఎస్ సంగీతం పర్వాలేదు అనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది.
కాకపోతే.. తమిళ వెర్షన్ లో కన్యాకుమారిని, తెలుగు వెర్షన్ లో కాకినాడగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం చేసిన గ్రాఫిక్స్ మాత్రం ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఆ మార్పులు చేయకుండా.. కన్యాకుమారి అని వదిలేసినా సినిమాకి వచ్చే హాని ఏమీ లేదని చిత్రబృందం గ్రహించి ఉంటే బాగుండేది. అలాగే తెలుగు టైటిల్స్ విషయంలో కూడా కనీస స్థాయి జాగ్రత్త వహించకపోవడం బాధాకరం.
దర్శకురాలు బృంద ఈ చిత్రాన్ని తెరకెక్కించింది అంటే నమ్మడం కాస్త కష్టమే. అందులోనూ ఆమె డైరెక్షనల్ డెబ్యూ ఫిలిమ్ “హే సినామిక” చూసిన తర్వాత “కోనసీమ తగ్స్” చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు. రైన్ ఫైట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ & క్లైమాక్స్ ను కంపోజ్ చేసిన విధానం మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. దర్శకురాలిగా బృంద తన మార్క్ క్రియేట్ చేసుకోలేకపోయినా.. ఒక హిట్ మాత్రం కొట్టిందీ చిత్రంతో.
విశ్లేషణ: ప్రతి సినిమాకూ టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. అలా “కోనసీమ తగ్స్”కు టార్గెట్ ఆడియన్స్ అయిన మాసెస్ కు ఈ చిత్రం విందు భోజనం లాంటిది. కెమెరా వర్క్ & స్క్రీన్ ప్లే కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా ఒకసారి చూడొచ్చు. అయితే.. ఈ తరహా హాలీవుడ్ వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు చూసేసిన మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను మాత్రం ఈ చిత్రం అంతగా ఎగ్జైట్ చేయదు.