వరుస విజయాల హీరో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం` ఈ ఏప్రిల్ 12న విడుదల కానుంది. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో శనివారం జరిగింది. దిల్‌రాజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమా ఫస్ట్ టికెట్‌ను దిల్‌రాజు ఆవిష్కరించారు. తిరుపతి హుండీలో వేయనున్నట్టు నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతి, మౌర్య, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి ప్రసాద్ మాట్లాడుతూ “చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్. ‘బాహుబలి’ తర్వాత తిరుపతిలో జరుగుతున్న ఫంక్షన్ ఇది. దర్శకుడిది రేణిగుంట. మేర్లపాక మురళీ తనయుడు. అతని గత రెండు చిత్రాలు బాగా తీశాడు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలి. ప్రజలకు ఏం కావాలో అదే చేస్తున్నాడు నాని. అతని కృషి అతని సక్సెస్. కంటిన్యూగా అన్ని సక్సెస్‌లు కొడుతూనే ఉంటాయి“ అని చెప్పాడు.
ఫైట్ మాస్టర్ జాషువా మాట్లడుతూ “మా దర్శకుడితో `ఎక్స్ ప్రెస్ రాజా` చేశా. ఆ సినిమాతో నా కెరీర్ కూడా ఎక్స్ ప్రెస్లాగా రన్ అయింది.నాని గారితో `మజ్ను` తర్వాత ఈ సినిమా చేశా. చిరంజీవిగారితో పనిచేసేటప్పుడు ఎలా పీలయ్యానో, నానిగారితో పనిచేసేటప్పుడు కూడా అలాగే పీలయ్యాను“ అని చెప్పారు.
ఫైట్ మాస్టర్ ఆర్.కె మాట్లాడుతూ “మా చిత్రయూనిట్‌కి చాలా థాంక్స్. తొలిసారి నేను ఇంత పెద్ద సినిమా చేశాను. చిన్న వర్క్ కోసం అని వెళ్లాను. ఈ సినిమాకు ఇంత పని చేయడం చాలా ఆనందంగా ఉంది.రామ్-లక్ష్మణ్ గారి శిష్యుడిని నేను“ అని అన్నారు.
`నిన్ను కోరి` దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ “పరిశ్రమలో నా కెరీర్ నాని గారితో మొదలైంది. ఆయన జీవితంలో ఏ మంచి విషయం జరిగినా చాలా ఆనందం. నా రెండో సినిమా ఇదే నిర్మాతలతో చేయబోతున్నాను. అందరూ కావాల్సిన వాళ్లు. నానిగారు ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు. అందుకే నాలాంటి దర్శకులు వస్తున్నారు. నానిగారి సినిమాలు ఎంత బ్లాక్‌బస్టర్ అయితే అంతమంది దర్శకులం వస్తాం. నిర్మాతలు మంచి సినిమాలు చేయాలని వచ్చారు. గాంధీగారి సినిమాల్లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉంటుంది“ అని అన్నారు.
డ్యాన్స్ మాస్టర్ రఘు మాట్లాడుతూ “నానిగారు ఎలాంటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆయనలో ఆ లక్షణం ఉంది. నా కెరీర్ మొత్తంలో నానిగారితో చేసిన జర్నీని ఎప్పుడూ మర్చిపోలేను. దర్శకుడు గాంధీగారితో ఇది నా రెండో సినిమా. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను“ అని చెప్పారు.
అభినవ్ మాట్లాడుతూ “మొదటి చిత్రంతో గాంధీ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా గాంధీకి పెద్ద హిట్ కావాలి. నానిగారికి పెద్ద హిట్ రావాలి. నిర్మాణంలో భాగమైన ముగ్గురు వ్యక్తులు తిరుపతి వాస్తవ్యులు కావడం ఆనందంగా ఉంది. మౌర్య నాకు బంధువు. గాంధీ, తేజ స్వరూప్ నాకు బాగా తెలుసు. నానిగారికి విలక్షణమైన శైలి. అది అంత తేలిగ్గా ఎవరికీ అబ్బేది కాదు. ఆయన పాత్రలను వీక్షించిన వారు వాటిలో తమ కుటుంబ సభ్యుల్ని చూసుకుంటారు. నాని అన్ని సినిమాలనూ నేను చూశాను. ఆయనకు పెద్ద అభిమానిని“ అని చెప్పారు.
పెంచలదాస్ మాట్లాడుతూ “నేను జానపద పాటలు పాడుతాను. చిత్రకారుణ్ణి. నాకు ఈ సినిమాకు అవకాశం ఎలా వచ్చిందంటే ఎస్వీ యూనివర్శిటీలో ఆర్ట్స్ ఆడిటోరియంలోకి రచయితల మీటింగ్‌కి వచ్చి పాటలు పాడేవాడిని. గాంధీగారి తండ్రి మురళీగారు, బాలాసార్ నన్ను చూసి సినిమా అవకాశం ఇస్తామని అన్నారు. అప్పుడు నేను సరే సార్ అన్నా. అక్కడి నుంచి ఒక రోజు రేణిగుంటలోవాళ్లింటికి తీసుకెళ్లారు. గాంధీగారు మెచ్చుకున్నారు. సినిమాలో చాన్స్ ఇస్తామన్నారు. ఎక్స్ ప్రెస్ రాజాకి అవకాశం ఇచ్చారు. కానీ అనారోగ్యకారణాల వల్ల పాడలేకపోయాను. ఈ సినిమాకు మళ్లీ నన్ను పిలిచి 20నిమిషాల్లో రాసి పాడతావా అని అడిగారు.రెండు లైన్లు విని ఓకే చేసి నన్ను మద్రాసుకు తీసుకెళ్లారు. అలా ఈ సినిమా మొదలైంది. ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. వింటుంటే చాలా ఆనందంగా ఉంది“ అని అన్నారు.
హిప్ హాప్ తమిళ మాట్లాడుతూ “ధ్రువ తెలుగులో నా తొలి చిత్రం. దాదాపు ఏడాది తర్వాత ఈ సినిమా చేశాను. ఇది నా రెండో సినిమా. దారి చూడు పాట ట్రెండింగ్ అవుతోంది. చిత్తూరు జిల్లా జానపదంతో ఈ పాటను తెరకెక్కించాం. పెంచలదాస్‌తో మంచి జానపదం పాడించాను. ముందు పాట పాడించి, ఆ తర్వాత సంగీతాన్ని అందించాం. భవిష్యత్తులోనూ నా సినిమాల్లో ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తాను. రీరికార్డింగ్ చాలా బాగా వచ్చింది. నానిని తొలిసారి ఇప్పుడే చూస్తున్నా. దర్శకుడి గాంధీకి ధన్యవాదాలు. నేను ఇంకా నిర్మాతలను చూడలేదు. ఈ సినిమాకు పాటలు ,రీరికార్డింగ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. రీరికార్డింగ్ సమయంలో నాని యాక్టింగ్ చూసి నవ్వుకుంటూ ఉన్నాను. ఈ చిత్రంలో కామెడీతో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. నేను నాలుగేళ్ల క్రితం యూట్యూబ్‌లో సంగీతం చేశాను. అక్కడి నుంచే నేను ఇంత దూరం వచ్చాను. “ అని చెప్పారు.
దిల్‌రాజు మాట్లాడుతూ “బాహుబలి ఫంక్షన్ తర్వాత ఈ వేడుక జరుగుతుంటే ఆనందంగా ఉంది. కడపలో ఓ టీచర్ వచ్చి సినిమా ద్వారా డయాస్ మీద వాలాడు. కర్ణాటక నుంచి మరొకతను వచ్చి ఇక్కడ వాలాడు. గాంధీ ఈ సినిమాతో హ్యాట్రిక్ డైరక్టర్ కాబోతున్నాడు. హిప్ హాప్ తమిళకు ఇంత మంచి ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. అనుపమ స్టేజ్ మీదకు వస్తుంటే గోల చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక్కో సినిమా ద్వారా వీళ్లు ఎదుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. రుక్సర్ ఈ సినిమా ద్వారా లాంచ్ అవుతోంది. టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారు. నిర్మాతల్లో సాహో మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ల మొదటి సినిమాకు చాలా మంచి హీరో దొరికాడు. నానికి, నాకు పోటీ జరగుతోంది. వరుస హిట్ల మీద ఉన్నాం. సినిమాకు కథ బావుంటే అన్నీ బావున్నట్టే. నానికి ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. అతను మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు. ఈ సినిమాను ఏపీ, తెలంగాణలో మేం విడుదల చేస్తున్నాం“ అని చెప్పారు.
అనుపమ మాట్లాడుతూ “నేను తొలిసారి తిరుపతికి వచ్చాను. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే, ఇప్పటికి కుదిరింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడుమొదలైందో, ఎప్పుడు పూర్తయిందో కూడా తెలియడం లేదు. గాంధీగారుచాలా ఆసక్తికరంగా డైలాగులు రాశారు. నిర్మాతలు చాలా బాగా చూసుకున్నారు. కెమెరామేన్‌కి, ప్రశాంతిగారికి థాంక్స్. పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి.రుక్సర్తో నాకు కొన్ని సీన్లున్నాయి. నానిగారు పర్ఫెక్ట్ ఫెలో. ఆయన ఒక సినిమా చేస్తున్నారంటే ఆయన అన్నిటి గురించి కేర్ తీసుకుంటారు“ అని చెప్పారు.
రుక్సర్ మాట్లాడుతూ “టీమ్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. వాళ్లతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది“ అని చెప్పారు.
మేర్లపాక గాంధీ మాట్లాడుతూ “తిరుపతి థియేటర్స్ లో, ఇంటర్లో నేను, హేమంత్ కలిసి గ్రూప్ థియేటర్స్ లో ఎక్కువగా తిరిగాం. రెండోది ఎల్వీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో, మూడోది నానిగారి దగ్గర ఆరు నెలలు నేర్చుకున్నా. నానిగారికి కథ చెప్పడం మొదలుపెట్టిన పది నిమిషాలే కథ చెప్పా. ఆయన ఓకేచెప్పేశారు. చిత్తూరుయాసను నానిగారు చాలా ఈజీగా చెప్పేశారు. చిత్తూరు యాస నాని పలకడం చాలా గర్వంగా ఫీలవుతున్నా. సుబ్బలక్ష్మి,రియా పాత్రల్లో ఇద్దరు హీరోయిన్లు చాలా బాగా చేశారు. హిప్ హాప్ తమిళ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. జీవాకూడా కొన్ని రీల్స్‌కి రీరికార్డింగ్ చాలా బాగా ఇచ్చారు. ప్రశాంతిగారు సినిమా కలర్ఫుల్గా కనిపించడానికి కారణం. మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత వెంకట్‌ది తిరుపతికొండ“ అని చెప్పారు.
నాని మాట్లాడుతూ “చిన్నప్పటి నుంచి మా తాతగారి ఊరికి ఎన్నిసార్లు వెళ్లానో తెలియదు కానీ, అంతకు మూడు రెట్లు ఎక్కువ తిరుపతికి వచ్చాను. నేనే కాదు.. ప్రతి తెలుగోడు తిరుపతి వాడే. ఏప్రిల్ 12న సినిమా విడుదలవుతుంది. గాంధీ ప్రతి చిన్న విషయానికీ నన్ను అడిగేవాడు. ఓన్ బ్రదర్‌లాగా అనిపించేది అతన్ని చూస్తే. తన దగ్గర చాలా కంఫర్ట్ గా ఉండేది. ఈ మధ్య కాలంలో ఇంత ఎంజాయ్ చేసిన సినిమా ఇంకోటి లేదు. మా టీమ్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ధ్రువ పాటలు నాకు చాలా ఇష్టం. హిప్హాప్ అయితే అదిరిపోతుంది అని నేను, గాంధీ ముందే అనుకున్నాం. రీరికార్డింగ్ కూడా బాగా చేస్తున్నాడని తెలిసింది. మా నాయికలు ఇద్దరూ చాలా బాగా నటించారు. ఈ సినిమాకు హీరోయిన్లవి చాలా కీలకమైనపాత్రలు. ఎందుకనేది సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఏప్రిల్ 12న మాట్లాడుతాను. చాలా నమ్మకంగా ఉన్నాను. రెండున్నరగంటలు ఫ్యామిలీ మొత్తం థియేటర్లకు వచ్చేయండి. ఏదైనా మంచి పని చేయాలంటే తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. మన ప్రీ రిలీజ్ ఈవెంటే ఇక్కడ మొదలైంది. ఇక తిరుగులేదు“ అని చెప్పారు.