Laal Singh Chaddha Review: లాల్ సింగ్ చడ్డా సినిమా రివ్యూ & రేటింగ్!
August 11, 2022 / 02:39 PM IST
|Follow Us
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “లాల్ సింగ్ చడ్డా”. హాలీవుడ్ క్లాసిక్ “ఫారెస్ట్ గంప్”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో నాగచైతన్య అక్కినేని ఓ కీలకపాత్ర పోషించాడు. అందుకే.. ఈ చిత్రాన్ని నాగార్జున, చిరంజీవి ప్రత్యేకంగా తెలుగులో ప్రమోట్ చేశారు. తెలుగులో చిరంజీవి సమర్పణలో విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం..!!
కథ: పుట్టుకతోనే స్పెషల్ కిడ్ లాల్ సింగ్ చడ్డా (అమీర్ ఖాన్). అయితే.. తన అంగవైకల్యాన్ని జయించి తల్లి దీవెనలతో మిలటరీలో జాయినవుతాడు. అనంతరం తన చిన్నప్పటి ప్రేయసి రూప (కరీనా కపూర్)ను పెళ్లాడడం కోసం ఆర్మీ నుండి వెనక్కి వస్తాడు. అదే సమయంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన బాలరాజు (నాగచైతన్య) కుటుంబానికి అండగా నిలుస్తాడు.
ఈ ప్రయాణంలో లాల్ సింగ్ నేర్చుకున్న జీవిత సత్యాలు, అతడ్ని వెంబడించిన అంశాల కలయికే “లాల్ సింగ్ చడ్డా” కథాంశం.
నటీనటుల పనితీరు: నటన విషయంలో అమీర్ ఖాన్ పర్ఫెక్షనిస్ట్ అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ చిత్రంలో ఆయన పోషించిన భిన్న షేడ్స్, అమీర్ ఖాన్ మునుపటి చిత్రాలు “పీకే, ధూమ్ 3” చిత్రాల్లోని అతడ్ని నటనను గుర్తుచేయడం గమనార్హం. ఇప్పటివరకూ ప్రతి చిత్రానికి విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ & నటనతో ఆకట్టుకునే అమీర్ ఖాన్ ఈ చిత్రానికి మాత్రం ఎందుకో పెద్దగా వైవిధ్యం చూపలేదనే చెప్పాలి.
రూప పాత్రలో కరీనా కపూర్ ఒదిగిపోయింది. అయితే.. ఆమె పాత్ర పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇకపోతే.. బాలరాజుగా నాగచైతన్య మాత్రం అదరగొట్టేశాడు. చైతన్య నటుడిగా ఎదుగుతున్నాడు అనేందుకు బాలరాజు పాత్ర మరో ఉదాహరణ. పైగా అన్నీ భాషల్లో తానే డబ్బింగ్ చెప్పుకోవడం మరో ప్లస్ పాయింట్. తల్లి పాత్రలో మోనా సింగ్ చక్కని అభినయంతో ఆకట్టుకుంది.
సాంకేతికవర్గం పనితీరు: ప్రీతమ్ అందించిన బాణీలు బాగున్నాయి కానీ.. తనూజ్ టికు నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి ఓ రకంగా మైనస్ గా మారిందనే చెప్పాలి. సత్యజిత్ పాండే సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ డిజైన్ క్వాలిటీని ఎలివేట్ చేసినంతలా.. సినిమాలోని ఎమోషన్ ను ఎలివేట్ చేయలేకపోయింది.
దర్శకుడు అద్వైత్ రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. ఎప్పుడో 94లో వచ్చిన సినిమాను చాలా చిన్నపాటి మార్పులతో, నేటివిటీ లేకుండా తెరకెక్కించడం మరో మైనస్. దర్శకుడిగా, కథకుడిగా అద్వైత్ “లాల్ సింగ్ చడ్డా”తో ఫెయిల్ అయ్యాడు.
విశ్లేషణ: బాలీవుడ్ ఫెయిల్యూర్ స్ట్రీక్ ను “లాల్ సింగ్ చడ్డా” బ్రేక్ చేస్తుంది అనే అంచనాలన్నీ తలకిందులయ్యాయి. “ఫారెస్ట్ గంప్” చూడని, అమీర్ ఖాన్ సినిమాల మీద ఎక్కువ అంచనా వేయని ప్రేక్షకులను మాత్రమే ఈ చిత్రం కాస్తో కూస్తో ఆకట్టుకుంటుంది.