K Viswanath: తన జీవిత కథ రాయమని కె.విశ్వనాథ్ని అడిగితే ఏమన్నారంటే..
February 3, 2023 / 04:42 PM IST
|Follow Us
తెలుగు సినిమా పతాకను దిగంతాలకు ఎగిరేలా చేసి, తన చిత్రాలతో తెలుగు సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లిన దర్శక దిగ్గజం కాశీనాధుని విశ్వనాథ్ ఆ విశ్వనాధుని సన్నిధికి చేరిపోయారు. ‘దొరకునా ఇటువంటి సేవ..నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేరు త్రోవ’ అంటూనే కదలి వెళ్లి పోయారు.. 92 సంవత్సరాల వయసులో వృద్దాప్య సమస్యల కారణంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారాయన.
‘స్వాతిముత్యం’, ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వర్ణకమలం’, ‘శుభసంకల్పం’, ‘స్వయంకృషి, ‘ఆపద్భాందవుడు’ ఇలా ఎన్నో అపురూపమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. 1980 ఫిబ్రవరి 2న ‘శంకరాభరణం’ విడుదలైంది. సరిగ్గా అదేరోజు అంటే అదే ఫిబ్రవరి 2 వ తేదీ, 2023 న ‘కళాతపస్వి’ పరమపదించడం కాకతాళీయం.. కె.విశ్వనాథ్ మృతికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా నివాళి అర్పిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆయనను చివరిసారి చూసేందుకు తరలి వెళ్తున్నారు.
ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియా వేదికగా విశ్వనాథ్ గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. రేడియో, మీడియా మరియు సాహిత్యరంగంలో అనుభవజ్ఞులైన చెన్నూరి సీతారాంబాబు.. కె.విశ్వనాథ్ గారితో తనకున్న పరిచయం, జ్ఞాపకాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటూ చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2017లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించినప్పుడు విశ్వనాథ్ గారిని ఇంటర్వూ చేసినప్పటి ఫోటోను పంచుకున్నారాయన. అలాగే.. ఆయన, విశ్వనాథ్ గారిని ‘మీ జీవిత కథ రాయొచ్చు కదా’ అని అడిగినప్పుడు వారిచ్చిన సమాధానం గురించి కూడా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
‘‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘శుభలేఖ’, ‘సిరిసిరిమువ్వ’,‘సప్తపది’, ‘కాలం మారింది’, ‘సీతామాలక్ష్మి’…ఇలా వారి చిత్రాలన్నీ ఆరోగ్యకరంగా ఉండి ప్రేక్షకుడి గుండె తడతాయి.మీ జీవితానుభవం రాయవచ్చు కదా అని వారినడిగితే నా చిత్రాల విశ్లేషణే నా జీవితం అన్నారు’’ అని పేర్కొన్నారు. చెన్నూరి సీతారాంబాబు, కె.విశ్వనాథ్ గురించి చేసిన పోస్టులు నెటిజన్లను, సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
కళాతపస్వి కె.విశ్వనాధ్ కన్నుమూత
వారికి నివాళి.
శంకరాభరణం,సాగరసంగమం, శుభలేఖ, సిరిసిరిమువ్వ,సప్తపది,కాలం మారింది,సీతామాలక్ష్మి…ఇలా వారి చిత్రాలన్నీ ఆరోగ్యకరంగా ఉండి ప్రేక్షకుడి గుండె తడతాయి.మీ జీవితానుభవం రాయవచ్చు కదా అని వారినడిగితే నా చిత్రాల విశ్లేషణే
నా జీవితం అన్నారు. pic.twitter.com/84lXIqBWxL