మాజీ టీం ఇండియా కెప్టెన్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన సినిమా రంగంలోకి అడుగుపెడుతూ ‘ఎల్.జి.ఎం'(లెట్స్ గెట్ మ్యారీడ్) అనే ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు అనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి.. ఆ సినిమాలో నటీనటులు ఎవరు అనే విషయాన్ని పట్టించుకోకుండానే భారీ అంచనాలు పెట్టేసుకున్నారు ప్రేక్షకులు!
ఇక ఈ సినిమాలో ‘జెర్సీ’ ఫేమ్ హరీష్ కళ్యాణ్, ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు అని తెలిసినప్పటి నుండి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఫోకస్ కూడా ఈ సినిమా పై గట్టిగా పడింది. టీజర్, ట్రైలర్లు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ‘ఎల్.జి.ఎం’ పై అంచనాలు ఇంకా పెరిగాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను మ్యాచ్ చేసిందో లేదో తెలుసుకుందాం రండి :
కథ : గౌతమ్ (హరీష్ కళ్యాణ్) చిన్నప్పుడే తండ్రిని కోల్పోతాడు. దీంతో తన తల్లి లీలా(నదియా) అన్నీ తానై అతన్ని పెంచి పెద్దవాడిని చేస్తుంది. తర్వాత గౌతమ్ తన ఆఫీస్ లో పనిచేస్తున్న మీరా (ఇవానా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.వీరిద్దరూ రెండేళ్ల పాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అవుతారు. పెద్దవాళ్ళకి చెప్పి పెళ్ళికి రెడీ అవుతారు.అంతా బానే ఉంది అనుకున్న టైంలో… మీరా.. గౌతమ్ ని పెళ్లి తర్వాత తన తల్లికి వేరుగా కాపురం పెట్టాలని కండీషన్ పెడుతుంది.
దీంతో గౌతమ్ కి కోపం వచ్చి..ఆమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. కానీ ఇద్దరూ ఒకరినొకరు మరచిపోలేక కలవాలని అనుకుంటారు. ఈ క్రమంలో మీరా పెళ్ళికి ముందు తన అత్తగారితో కొన్ని రోజులు గడిపి.. తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అనుకుంటుంది. అందుకోసం కూర్గ్ కు ట్రిప్ ప్లాన్ చేస్తుంది. ఆఫీస్ ట్రిప్ అని అబద్ధం చెప్పి గౌతమ్ తన తల్లిని ట్రిప్ కి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఈ అత్తాకోడళ్ల మధ్య ఎలాంటి గొడవలు చోటు చేసుకున్నాయి.? వీళ్ళ మధ్య గౌతమ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : హీరో హరీష్ కళ్యాణ్ తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో, లుక్స్ తో పర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ భీభత్సమైన పెర్ఫార్మన్స్ అయితే ఏమి చేసింది లేదు. తెలుగులో డబ్ చేసే తమిళ సినిమాల్లో కనుక గమనిస్తే.. దాదాపు హీరోలకి ఒకరితోనే డబ్బింగ్ చెప్పిస్తున్నారు. దీంతో హీరోల మార్క్ పెర్ఫార్మన్స్ లు మిస్ అయిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ సినిమాలో హీరో కంటే కూడా ఇవానా, నదియా పాత్రల నిడివి ఎక్కువ అని చెప్పాలి. నదియా ఎప్పటిలానే తన మార్క్ పెర్ఫార్మన్స్ తో కనిపించింది అంతే.! ఆకట్టుకుంది అని మాత్రం చెప్పలేం. అలాగే ఆమె పాత్ర నుండి ఎక్కువగా ఆశించేది కూడా ఏమీ ఉండదు.
ఇక హీరోయిన్ ఇవాన కూడా ఈ సినిమాలో కొత్తగా చేసింది అంటూ ఏమీ లేదు. చాలా వరకు ‘లవ్ టుడే’ సినిమాలో కనిపించినట్టే కనిపించింది. డైలాగులు కూడా అలాగే అనిపిస్తుంది. యోగిబాబు అక్కడక్కడ నవ్వించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ‘మూడో నెంబర్ సాక్స్.. నిన్ను నా చేత్తో పట్టుకుని బయటకు విసిరేస్తా’ అంటూ అతను హీరోయిన్ పై వేసే కౌంటర్ హిలేరియస్ గా అనిపిస్తుంది. ఆర్జే విజయ్ హీరో ఫ్రెండ్ పాత్రలో పర్వాలేదు అనిపిస్తాడు. హీరో బాస్ పాత్రలో తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఓ సన్నివేశంలో కనిపించాడు. మిగిలిన వారి పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు రమేష్ తమిళ్ మణి ఎంచుకున్న పాయింట్ కొత్తది కాకపోయినా మంచిదనే చెప్పవచ్చు. ప్రెజంట్ జెనరేషన్లో అత్తా- కోడళ్ళు కలిసి ఉంటున్న సందర్భాలు చాలా తక్కువైపోయాయి. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘ఈ రోజుల్లో భార్యాభర్తలు కలిసుండటానికే టైం ఉండటం లేదు. అలాంటిది అమ్మ, అక్కతో కలిసుంటాను అంటున్నావు’ అంటూ హీరోతో అతని ఫ్రెండ్ చెబుతాడు.ఆ ఒక్క డైలాగ్ తో సినిమా థీమ్ ను చెప్పేశాడు దర్శకుడు. కానీ ఆసక్తికరంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు.
ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అంశాలు లేవు. అలాగే ఆలోచింపజేసే విధంగా కూడా సన్నివేశాలు లేవు. కామెడీ కూడా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. నిర్మాతలైన ధోని, సాక్షి, వికాస్ లు మంచి కథతో సినిమా చేద్దాం అనుకున్నారు. కథకు తగ్గట్టు బాగానే ఖర్చు చేశారు. వాళ్ళ ప్రయత్నంలో లోపం లేదు.ఇక విశ్వజిత్ ఒదుక్కత్తిల్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. రమేష్ తమిళ్ మణి అందించిన నేపధ్య సంగీతం జస్ట్ ఓకె.
విశ్లేషణ : ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. మొదట్లో జిడ్డుగా అనిపించినా చివర్లో సిక్సులు కొట్టి అందరిలో జోష్ నింపుతాడు. అలాంటి టైంలో చాలా సార్లు మ్యాచ్ లు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘ఎల్.జి.ఎం’ కూడా అలాగే ఉంటుందేమో అని చివరి వరకు ఓపిగ్గా కూర్చుంటే అలాంటి మెరుపులు ఏమీ కనిపించవు. ధోని వీరాభిమానులు ఏమీ ఆశించకుండా ఈ సినిమాకి వెళ్తే బెటర్. లేకుంటే నిరాశచెందే అవకాశాలు ఉన్నాయి .
రేటింగ్ : 2/5