Ananta Sriram: ఆ విషయంలో సంతృప్తి లేదన్న అనంత శ్రీరామ్!
December 13, 2021 / 04:40 PM IST
|Follow Us
తెలుగులోని ప్రముఖ పాటల రచయితలలో అనంత శ్రీరామ్ కూడా ఒకరు. అఖండ సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన జై బాలయ్య, భం అఖండ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తన సినీ కెరీర్ లో అనంత శ్రీరామ్ 600కు పైగా సినిమాలలో పాటలు రాశారు. 16 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో పాటల రచయితగా అనంత శ్రీరామ్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రేమ పాటలతో పాటు యుగళ గీతాలను, మాస్ ప్రేక్షకులకు నచ్చే పాటలను అనంత శ్రీరామ్ ఎక్కువగా రాస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ బాహుబలిలో పచ్చ బొట్టేసినా పాట రాయడానికి 73 రోజుల సమయం పట్టిందని ఆఖండ సినిమాలోని భం అఖండ పాటను మూడు రోజుల్లో పూర్తి చేశానని తెలిపారు. కళాకారులకు ఒక విధంగా కరోనా వల్ల మేలు జరిగిందని లాక్ డౌన్ వల్ల వచ్చిన విరామ సమయం వల్ల అద్భుతమైన పాటలు రాసే అవకాశం దక్కిందని ఆయన తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్లు, డైరెక్టర్ల ప్రోత్సాహంతోనే పాటలు రాస్తున్నానని అనంత శ్రీరామ్ చెప్పారు.
తాను గోదావరి తీరంలో పెరిగానని పశ్చిమ గోదావరి జిల్లాలోని దొడ్డిపట్ల సొంతూరు అని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. 2005 సంవత్సరంలో పాటల రచయితగా కెరీర్ ను మొదలుపెట్టానని వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజాలకు యువ పాటల రచయితలు ప్రత్యామ్నాయం కాలేరని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు. తక్కువ పదాలతో భావుకత ఉండే విధంగా పాటలు రాయడం యువ రచయితలకు సవాల్ అని ఆయన వెల్లడించారు. తన సినీ కెరీర్ లో రాసిన పాటల విషయంలో సంతృప్తి లేదని గొప్ప పాటలు రాసే ప్రయత్నం చేస్తున్నానని అనంత శ్రీరామ్ అన్నారు.
సంతృప్తి ఇచ్చిన పాట రాసిన తర్వాత సినిమాల నుంచి తప్పుకుంటానని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు. సర్కారు వారి పాట, ఆచార్య, థ్యాంక్యూ సినిమాలలో పాటలు రాశానని ఆయన తెలిపారు. ఈ సినిమాలలో రాసిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉందని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు.