కీర్తి సురేష్ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే మహానటికి ముందు, తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను శైలజ మూవీతో కీర్తి సురేష్ తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. నేను లోకల్ తో వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్నారు. అజ్ఞాతవాసిలోను ఆకట్టుకున్నారు. సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఈ బ్యూటీ తమిళంలోనూ రెమో వంటి విజయాలను సొంతం చేసుకున్నారు. తెలుగులో, తమిళంలో అభిమానులను సంపాదించుకున్న కీర్తి సురేష్ ని నాగ్ అశ్విన్ సావిత్రి పాత్ర కోసం తీసుకున్నారు. డైరక్టర్ నమ్మకాన్ని కీర్తి సురేష్ నిలబెట్టుకున్నారు. నిన్న రిలీజ్ అయిన మహానటి మూవీని చూసిన ప్రతి ఒక్కరూ కీర్తి సురేష్ నటన గురించే మాట్లాడుకుంటున్నారు. కట్టు, బొట్టు, నడక, నటన అన్ని విధాలుగా సావిత్రిని గుర్తుకు తెచ్చిందని అభినందిస్తున్నారు.
రాజమౌళి సైతం కీర్తిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మూవీ రేపు తమిళంలో రిలీజ్ కానుంది. ఆ సినిమాని చూడకముందే కోలీవుడ్ సినీ ప్రముఖులు కీర్తి సురేష్ ఇంటి ముందు వాలిపోయారు. ప్రముఖ నటి, మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్ లో నటించాలని కోరుతున్నారు. ఇదివరకు అనేకమంది నటీమణులను పరిశీలించిన చిత్ర బృందం పెద్దగా సంతృప్తి చెందలేదు. నయనతారను కూడా సంప్రదించారు. అయినా ఆ ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితమైంది. మహానటిలో కీర్తి సురేష్ నటన చూసి జయలలితగా ఆమెనే ఫిక్స్ అయిపోయారు. ఇక కీర్తి ఒకే అంటే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.