Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ కు రమణా రెడ్డి పురస్కారం.. సొంత ఊర్లో ఊహించని అనుభవం ..!
January 20, 2022 / 09:55 PM IST
|Follow Us
జనవరి 10 న రమణా రెడ్డి జయంతి ని పురస్కరించుకొని ప్రముఖ సాంస్కృతిక సంఘ సేవా సంస్థ కళా నిలయం అధ్వర్యంలో బొగ్గులకుంట తెలంగాణ సారస్వత పరిషత్తులోని డా.దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగిన వేడుకల్లో ‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ ఆచంటను ఘనంగా సత్కరించి.. అనంతరం అతనికి ఒకప్పటి స్టార్ కమెడియన్ రమణారెడ్డి పురస్కారాన్ని అందజేశారు. రమణా రెడ్డిగారు ఎంత గొప్ప నటులో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన ఓ సినిమాలో నటించాడు అంటే..
అతని నటన కోసం హీరోతో సంబంధం లేకుండా జనాలు థియేటర్లకి వెళ్ళేవారు అనడంలో అతిశయోక్తి లేదు. ఒక రోజులో 10 సినిమాలకి సంబంధించిన షూటింగ్లలో పాల్గొన్న నటుడిగా ఆయన రికార్డులు సృష్టించారు. అప్పట్లో హీరోల కాల్ షీట్ల కంటే ఈయన కాల్ షీట్లు దొరకడం నిర్మాతలకి కష్టమయ్యేది. అలాంటి గొప్ప నటుడి పేరు పై అవార్డులు ఇవ్వడం అందరూ గర్వించదగ్గ విషయమే.! ఇక రమణారెడ్డి పురస్కారాన్ని అందుకున్న మహేష్ కు తన సొంత ఊర్లో ఘన స్వాగతం లభించింది.
ఈ క్రమంలో అతను మాట్లాడుతూ.. ‘అంత గొప్ప మహానుభావుడి పురస్కారాన్ని అందుకోవడం నా జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో రమణా రెడ్డి పురస్కారం ఎంతో మందికి దక్కాలని.. ఆయన పేరు పై ఆ వేడుకలు అలా కొనసాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ విధంగా నేను సినిమాల్లోకి రావాలనే ప్రేరేపణ కలిగింది రమణా రెడ్డి గారి వల్లనే..! నేను చదువుకునే రోజుల్లో కొంతమంది నన్ను.. ‘నువ్వు రమణా రెడ్డిలా ఉన్నావు.. సినిమాల్లో చేస్తున్నావా’ అని అన్నారు.
అప్పటి నుండీ నాకు నటన పై వ్యామోహం కలిగింది. ఓ చిన్న తాటాకు ఇంట్లో పెరిగిన నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే రమణా రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ నా పై ఎంతో ఉంది.నాలాంటి వాళ్లకు ఎంతో మందికి ఆయన స్ఫూర్తిదాయకం’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.