Mahesh Babu: పాన్ ఇండియా ఇమేజ్… మహేష్ కి కష్టమేనా?
February 17, 2022 / 10:58 AM IST
|Follow Us
త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్‌బాబు… రాజమౌళి సినిమా చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారు కూడా. ఆ సినిమాతో మహేష్ పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. ఇదంతా వినడానికి, లెక్కలేసుకోవడానికి బాగుంది. కానీ ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించి ఓ లెక్క మాత్రం మహేష్ అభిమానుల్ని ఇబ్బంది పెడుతోంది. అదే హిందీ డబ్బింగ్ రైట్స్ అమౌంట్. ఈ సినిమా హిందీ రైట్స్ డీల్ ఓకే అయ్యిందట.
‘సర్కారు వారి పాట’ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ₹15 కోట్లు పలికిందని టాక్. దీనిపై ఎక్కడా అధికారిక సమాచారం లేకపోయినా అమౌంట్ ఇంతే అంటున్నారు. దీంతో ఏంటీ… మరీ ఇంత తక్కువా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇలా అనుకోవడానికీ కారణం ఉంది. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో ‘పుష్ప’ సినిమాకు ₹30 కోట్లు వచ్చాయి. ‘ఆచార్య’కు ₹20 కోట్ల నుండి ₹25 కోట్లు వచ్చాయి అంటున్నారు. అలాంటిది మహేష్ సినిమాకు అంత తక్కువనా అని అడుగుతున్నారు.
గోపీచంద్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి కథానాయకుల సినిమాలకే హిందీ శాటిలైట్ ద్వారా ₹10 వరకూ వస్తోంది. అలాంటిది మహేష్ బాబు సినిమాకు అంత తక్కువ ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ అంటే ఇష్టం లేదని, నేను టాలీవుడ్లోనే ఉంటానని గతంలో మహేష్‌బాబు అన్నట్లు గుర్తు. ఇప్పుడు ఆ మాటలే ఇబ్బంది పెట్టాయా అని కూడా అనుకుంటున్నారు. అయితే మహేష్‌బాబు – రాజమౌళి సినిమా తర్వాత పరిస్థితులు మారుతాయి అని అనుకుంటున్నారు.
‘సర్కారు వారి పాట’ సినిమాను మే 12న విడుదల చేయాలని చూస్తున్నారు. చిన్న గ్యాప్ తర్వాత మహేష్ షూటింగ్‌ని స్పీడప్ చేస్తున్నాడు. ఇంకా సినిమా రిలీజ్‌కు టైమ్ ఉండటంతో, త్వరలోనే త్రివిక్రమ్ సినిమాను కూడా మొదలుపెట్టేస్తారని సమాచారం. ఆ సినిమా ముహూర్తపు షాట్‌తో ఇటీవల లాంఛనంగా స్టార్ట్ అయ్యింది. త్వరలో పూర్తి స్థాయి చిత్రీకరణ మొదలవుతుందట. ఇందులో కథానాయికగా పూజా హెగ్డేను ఎంచుకున్నారు. ఆమెతోపాటు శ్రీలీల మరో నాయికగా నటిస్తుందని తాజాగా వార్తలొస్తున్నాయి.