Guntur Kaaram: ఆ థియేటర్లో 200 రోజులు ఆడిన ‘గుంటూరు కారం’
July 31, 2024 / 04:33 PM IST
|Follow Us
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) .. కలయికలో ‘అతడు’ (Athadu) ‘ఖలేజా’ (Khaleja) వంటి చిత్రాల తర్వాత భారీ అంచనాల నడుమ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) అనే సినిమా వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.కానీ మహేష్ బాబుకి, త్రివిక్రమ్..కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్, పైగా సంక్రాంతి పండుగ సెలవులు వంటివి కలిసొచ్చి భారీ ఓపెనింగ్స్ ని సాధించింది ఈ మూవీ.
కొన్ని ఏరియాల్లో అయితే సంక్రాంతి సెలవులు ముగిశాక కూడా నిలదొక్కుకుని మొత్తానికి రూ.110 కోట్ల షేర్ ను సాధించింది. మహేష్ బాబు ఈ విషయంలో పెద్ద రికార్డు కొట్టాడు అనే చెప్పాలి. నెట్ ఫ్లిక్స్ లో(ఓటీటీలో) రిలీజ్ అయినప్పుడు కూడా 2 వారాల పాటు నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యింది ‘గుంటూరు కారం’. మరోపక్క జెమినీ టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు కూడా 9 కి పైగా టీఆర్పీ రేటింగ్ ను సాధించి పర్వాలేదు అనిపించింది.
మరోపక్క 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ‘గుంటూరు కారం’ సినిమా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడులో ఉన్న చిలకలూరిపేట వెంకటేశ్వర థియేటర్లో 200 రోజులు(రోజుకి 4 ఆటలుగా) ప్రదర్శింపబడి చరిత్ర సృష్టించింది. ఈ రోజుల్లో నెగిటివ్ టాక్ తెచ్చుకున్న పెద్ద సినిమాలు 2 వారాలు థియేటర్లలో నిలబడటమే కష్టంగా ఉంది. అలాంటిది ‘గుంటూరు కారం’ సినిమా 200 రోజులు ఆడింది అంటే మామూలు విషయం కాదు. మహేష్ బాబుకు ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ వల్లే ఇది సాధ్యమైంది అని చెప్పాలి.