ఉద్యోగం పురుష లక్షణం అంటారు.. ఉద్యోగం చేయని, దొరక్క ఖాళీగా ఉన్న కుర్రాళ్లని సమాజంలో ఎలా చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఓ కుర్రాడికి పెళ్లై.. ఆ భార్య తన భర్త ఉద్యోగం చేయకపోయినా కూడా తానే భర్తను పోషిస్తూ, భర్తను సపోర్ట్ చేయడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. దర్శకుడు శివ నిర్వాణ “మజిలీ” కోసం రాసుకున్న కథ అదే. బ్రేకప్ కారణంగా జీవితంలో కోలుకోలేని దెబ్బ తిన్న నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత.. తర్వాత అతడి బాధ్యతతోపాటు బాధను కూడా పంచుకుంటుంది. అయితే.. చివరికి వారి మజిలీ ఏ తీరానికి చేరింది అనేది “మజిలీ” సినిమా చూసి తెలుసుకోమంటున్నాడు శివ నిర్వాణ.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన “మజిలీ” ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఆ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్లో సగటు గృహిణిగా సమంత నేచురల్ గా ఉండగా.. ఒక ఫెయిల్యూర్ లవర్/హజ్బెండ్ గా నాగ్చైతన్య రగ్గడ్ లుక్ లో అదరగొట్టాడు. ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంది. ముఖ్యంగా రావురమేష్ పోషించిన తండ్రి పాత్రకి చాలామంది కనెక్ట్ అవుతారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలవుతోంది. ఎమోషనల్ జర్నీగా సాగే ఈ చిత్రం పెళ్లయ్యాక నాగచైతన్య-సమంత కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. మరి సినిమాని ప్రేక్షకులు, విమర్శకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూద్దాం.