టాలీవుడ్ లో భారీ బ్యాక్ గ్రౌండ్ కలిగిన కుటుంబాలలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఒకటి. విలన్ గా, హీరోగా 500 పైగా చిత్రాలలో నటించిన మోహన్ బాబు నటవారసులుగా విష్ణు, మనోజ్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఓ ఏడాది గ్యాప్ లో ఇద్దరూ వెండితెరకు హీరోలుగా పరిచయం అయ్యారు. 2003లో వచ్చిన విష్ణు సినిమాతో విష్ణు ఎంట్రీ ఇవ్వగా, 2004లో దొంగ దొంగది సినిమాతో మనోజ్ హీరోగా మారాడు.
అంటే వీరు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఓ 15ఏళ్ళు దాటిపోయింది. మరి ఇంత సుదీర్ఘ సినీ ప్రయాణం కలిగిన వీరు, కనీస ఇమేజ్ సొంతం చేసుకోలేక పోయారు. సినిమాలైతే చాలానే చేశారు..కానీ వాటిలో కనీసం 5 హిట్లు లేవు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నాని, శ్వరానంద్, విజయ్ దేవరకొండ లాంటి వారు హీరోలుగా ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక వీరితో పాటు ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ స్టార్ హీరో హొదాకి వెళ్లిపోయారు.
కాగా ఈ ఇద్దరు హీరోలు టాలీవుడ్ లో సరైన హిట్, ఇమేజ్ అందుకోలేదు కానీ ఏకంగా పాన్ ఇండియా ఇమేజ్ పై కన్నేశారు. మంచు విష్ణు ప్రస్తుతం నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మోసగాళ్లు పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఇక మనోజ్ అహం బ్రహ్మస్మి అనే భారీ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. అలాగే భక్త కన్నప్ప చిత్రాన్ని మంచు విష్ణు హీరోగా 90 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్లు ప్రకటిచడం జరిగింది. దీనితో మంచు హీరోలు ఇంత ఓడి రచ్చ గెలవాలని చూస్తున్నారు అని చెప్పుకుంటున్నారు.